సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డికాదు.. గోబెల్స్ రెడ్డి’ అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్‌ఎస్ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
మూసి సుందరీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10 వేల 17 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు కూల్చారు. లక్ష జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా?. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా?.రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..!.మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారు’అని ఆరోపించారు.


