యాదాద్రి భువనగిరి జిల్లా: మరికాసేపట్లో బామ్మర్ది పెళ్లి జరగాల్సి ఉండగా.. కుటుంబ సమస్యలతో ఉరేసుకుని బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన చిన్నం రమేష్(32) టోయింగ్ వెహికిల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేష్ కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల అతడి తల్లి మృతిచెందడంతో మానసికంగా మరింత కుంగిపోయాడు. గురువారం రమేష్ సొంత బామ్మర్ది వివాహం జరగాల్సి ఉండగా.. బుధవారం చిన్నరామచర్ల గ్రామంలో జరిగిన హాల్ది వేడుకల్లో పాల్గొన్నాడు.
అనంతరం రాత్రి కారులో రమేష్ ఆలేరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం భార్య, కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రమేష్ స్పందించలేదు. దీంతో పక్కింటి వారికి చెప్పడంతో వారు వెళ్లి చూడగా.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని రమేష్ కనిపించాడు. మృతుడి సోదరి చిన్నం స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వినయ్ తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ ఆత్మహత్యతో గురువారం జరగాలి్సన అతడి బావమర్ది పెళ్లి నిలిచిపోయింది.


