వేట్లపాలెం ఘటనకు కారణాలేమిటో! | 22 Killed In Fireworks Factory Explosion, CCTV Footage Key To Solving Samarlakota Explosion Mystery | Sakshi
Sakshi News home page

వేట్లపాలెం ఘటనకు కారణాలేమిటో!

Mar 3 2026 4:17 AM | Updated on Mar 3 2026 11:32 AM

Incident in Kakinada Vetlapalem

సీసీ కెమెరా రికార్డులు పరిశీలించారా! 

ఆ 10 మందీ ఏమయ్యారు? 

దర్యాప్తు తీరుపై ఎన్నో సందేహాలు 

మొండెం లేని మహిళ తల గుర్తింపు 

కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏడుగురు 

వారిలో నలుగురి పరిస్థితి విషమం

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో 22 మంది ప్రాణాలను బలిగొన్న భారీ విస్ఫోటనం ఘటన జరిగి మూడు రోజులైంది. ఇంతటి భారీ పేలుడు సంభవించడానికి కారణాలేమిటి? ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు? మృతులు, క్షతగాత్రులు కాకుండా మిగిలిన వారు ఏమయ్యారనే ప్రశ్నలకు ఇప్పటివరకూ జవాబులు లభించడం లేదు. దర్యాప్తు సరైన దిశగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

సీసీ కెమెరా దృశ్యాలపై దృష్టి పెట్టలేదేం? 
నిబంధనల ప్రకారం ప్రతీ బాణసంచా తయారీ కేంద్రం, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధన ప్రకారం సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆయన సెల్‌ఫోన్‌లో రికార్డవుతాయి. ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు పూర్తిగా కాలిపోయినా.. సెల్‌ఫోన్‌లో నిక్షిప్తమైన వీడియో దృశ్యాలు లభించే అవకాశం ఉంది. ఈ రికార్డులను పరిశీలిస్తే తొలుత విస్ఫోటనం ఎక్కడ జరిగింది.. ఎక్కడి నుంచి, ఏవిధంగా మంటలు చెలరేగాయి.. ఆ సమయంలో అక్కడ ఎంతమంది పని చేస్తున్నారనే అంశాలపై స్పష్టత వస్తుంది.  

అంతా గోప్యమే 
సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ లైసెన్స్‌ అడబాల అర్జున్‌ పేరిట ఉంది. దీని నిర్వహణలో అర్జున్‌తో పాటు ఆయన సోదరుడు నాని, తండ్రి శ్రీనివాసరావు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు మరణించగా.. అర్జున్, నానిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించిన నేపథ్యంలో వారికి నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతుండగా.. అది అవాస్తవమని, తండ్రికి తలకొరివి పెట్టేందుకు కూడా వారిని అనుమతించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఏ సమాచారం రాబట్టారనే విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగానే ఉంచారు.  

విషమంగా నలుగురి పరిస్థితి 
పేలుడు ఘటనలో కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో ఇంకా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది.

మహిళ తల గుర్తింపు 
ఇలావుండగా.. ఘటనా స్థలానికి సమీపంలోని పొలంలో మొండెం లేని మహిళ తలను సోమవారం గుర్తించారు. ఘటన జరిగిన రోజున తలలు లేకుండా దొరికిన రెండు మొండేలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో వారికి అప్పగించారు. వారి మతాచారం ప్రకారం ఆ మొండేలను ఖననం చేసేశారు. ఇప్పుడు దొరికిన ఈ తల.. ఆ రెండు మొండేల్లో ఒకటైన సక్కుమళ్ల రాఘవ(50)దిగా గుర్తించినట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. అయినప్పటికీ, ఈ తలకు డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తామని చెబుతున్నారు.  

ఆ 10 మందీ ఏమయ్యారో! 
స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు జరిగిన సమయంలో సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో 40 మంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం ఘటనా స్థలంలో 20 మంది సజీవ దహనం కాగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మరణించారు. మరో ఏడుగురు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ 30 మంది కాకుండా మిగిలిన 10 మంది ఏమయ్యారనే ప్రశ్నకు ఇప్పటివరకూ జవాబు దొరకడం లేదు. వీరు ఆ రోజు ఘటనా స్థలంలోనే ఉన్నారా లేక ప్రమాదం నుంచి తప్పించుకుని ఇళ్లకు వెళ్లిపోయారా అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దీనిని నిర్ధారించాలంటే సీసీ కెమెరాల ఫుటేజే ఆధారం. ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తారో లేదో వేచిచూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement