సిలిండర్‌ డెలివరీపై కఠిన నియమం | OTP Rule Delays Gas Cylinder Delivery In Hyderabad | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ డెలివరీపై కఠిన నియమం

Mar 13 2026 10:28 AM | Updated on Mar 13 2026 12:02 PM

OTP Rule Delays Gas Cylinder Delivery In Hyderabad

హైదరాబాద్: గ్యాస్‌ సిలిండర్ల డెలివరీకి ‘ఓటీపీ’ సమస్యగా మారింది. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్ల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నది. గ్యాస్‌ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే గ్యాస్‌ సిలిండర్ల డెలివరీలో తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేసుకోవాలని, ఓటీపీ నెంబర్‌ చెబితేనే సిలిండర్‌ జారీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గత పది రోజుల నుంచి డెలివరీ బాయ్స్‌ గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఓటీపీ నెంబర్‌ తప్పనిసరిగా నమోదు చేసుకుంటున్నారు. 

ఓటీపీ నమోదులో చాలా సమయం తీసుకుంటున్నదని డెలివరీ బాయ్స్‌తో పాటు గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఖైరతాబాద్‌ రేషనింగ్‌ సర్కిల్‌–7 పరిధి కిందికి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో 81 రేషన్‌ దుకాణాలు ఉండగా, 9 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,57,221 గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, ఒక్కో ఏజెన్సీ రోజూ 500–600 వరకు మాత్రమే సిలిండర్లు పంపిణీ చేస్తుంది. రెండు వారాల క్రితం ఒక్కో గ్యాస్‌ ఏజెన్సీ 700–800 వరకు గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసేది. రెండు వారాల క్రితం వరకు ఓటీపీ అడగగకుండానే బుకింగ్‌ చేసుకున్న వినియోగదారుడికి సిలిండర్‌ పంపిణీ చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్లు పక్కదారి పట్టకుండా డెలివరీ సమయంలో పకడ్బందీగా సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.  

ఓటీపీకి చాలా సమయం.. 
గ్యాస్‌ బుకింగ్‌ చేసుకున్న సమయంలో ఆ గ్యాస్‌ కనెక్షన్‌ ఎవరి పేరుపై ఉంటే వారి మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. రెండు మూడు వారాల తర్వాత సిలిండర్‌ డెలివరీ సమయంలో డెలివరీబాయ్‌ బుకింగ్‌ సమయంలో వచ్చిన ఓటీపీని అడుగుతాడు. ఆ ఇంటి యజమానురాలు కనెక్షన్‌ ఎవరి పేరుపై ఉందో వారికి ఫోన్లు చేసి ఓటీపీ నెంబర్‌ తీసుకుని మళ్లీ డెలివరీ బాయ్‌కు చెప్పగానే తాజా బిల్లుతో పాటు వచ్చే ఓటీపీ, బుకింగ్‌ సమయంలో వచి్చన ఓటీపీ సరిపోవాల్సి ఉంటుంది. తేడా వస్తే సమయం అంతా వృథా అవుతుందని డెలివరీ బాయ్స్‌ వాపోతున్నారు. ఒక్కో సిలిండర్‌ పంపిణీకి గతంలో ఐదు నిమిషాలు పడితే, ఇప్పుడు పావుగంట సమయం తీసుకుంటున్నది. దీని వల్లనే సిలిండర్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. 

ఆందోళన వద్దు.. కొరత లేదు 
కావలసినన్ని సిలిండర్లు ఉన్నాయి. వచ్చిన చిక్కల్లా ఓటీపీతోనే. ప్రతి సిలిండర్‌ డెలివరీలోనూ ఓటీపీ నమోదు చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే చాలా సమయం తీసుకుంటుంది. మా ఏజెన్సీ పరిధిలో రెండు వారాల క్రితం వరకు రోజుకు 800 సిలిండర్లు పంపిణీ చేసేవాళ్లం. ఇప్పుడు 600 మాత్రమే చేయగలుగుతున్నాం. డెలివరీ బాయ్స్‌ సైతం సిలిండర్లను అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మా ఏజెన్సీ పరిధిలో బుకింగ్‌ చేసుకున్న రెండు రోజుల్లోనే గ్యాస్‌ సరఫరా అవుతోంది. గృహావసరాల డొమెస్టిక్‌ సిలిండర్ల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమర్షియల్‌ సిలిండర్ల కొరత మాత్రం ఉంది. బుకింగ్‌ సమయంలో వచ్చే ఓటీపీని కనెక్షన్‌ ఉన్న వినియోగదారుడు తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. బుకింగ్‌ సమయంలో వచ్చే ఓటీపీకి, డెలివరీ సమయంలో వచ్చే ఓటీపీకి ట్యాలీ కావలసి ఉంటుంది. త్వరత్వరగా ఓటీపీ నెంబర్‌ చెబితే అంతే త్వరగా సిలిండర్ల పంపిణీ కూడా జరుగుతుంది. చాలామంది సిలిండర్లు దొరకవేమోనని ఆందోళన చెందుతున్నారు. అది సరికాదు. గ్యాస్‌ గోడౌన్లలో కావలసినన్నీ సిలిండర్లు స్టాక్‌లో ఉన్నాయి.

అక్రమార్కులపై కొనసాగుతున్న దాడులు 
బంజారాహిల్స్‌: గ్యాస్‌ సిలిండర్ల రీఫిల్లింగ్‌ సెంటర్లతో పాటు వాణిజ్య సిలిండర్ల స్థానంలో డొమెస్టిక్‌ సిలిండర్లు వినియోగిస్తున్న ప్రాంతాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు, టాస్‌్కఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. గురువారం జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్‌్కఫోర్స్‌ ఎస్‌ఐ రవిరాజ్, రేషనింగ్‌ ఖైరతాబాద్‌ సర్కిల్‌–7 జూనియర్‌ ఎంక్వైరీ ఇన్‌స్పెక్టర్లు టి.సాయికిరణ్, రాచకొండ సాహిత్‌సాగర్‌ తదితరులు వెంకటగిరిలో దాడులు చేశారు. అచిన్‌తల్వార్‌ బాలాజీ అనే వ్యక్తి డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి మినీ సిలిండర్లకు గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో దాడులు చేశారు. ఇందులో భాగంగా రెండు డొమెస్టిక్‌ సిలిండర్లతో పాటు 35 మినీ సిలిండర్లను స్వా«దీనం చేసుకున్నారు. బాలాజీపై కేసు నమోదు చేశారు. అలాగే అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ ప్రాంతాల్లో రేషనింగ్‌ అధికారులు దాడులు చేసి అక్రమంగా వినియోగిస్తున్న 11 సిలిండర్లను స్వా«దీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. నిరంతరం ఈ దాడులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement