సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొలివిడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టిషాకిచ్చారు. సర్పంచ్ స్థానాల్లో ఇతరుల కంటే తక్కువ స్థానాల్ని బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
ఇక ఈ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ఎంపీ ఈటల రాజేందర్ బిగ్‌షాక్ తగిలింది. ఈటల బలపరిచిన బీజేపీ రెబల్ అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదే సమయంలో బండి సంజయ్ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపుపొందారు. ఈటల రాజేందర్ మద్దతు తెలిపిన ర్యాకం సంపత్ ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం ఈ ఘటన పంచాయతీ ఎన్నికల్లో హాట్‌టాపిగ్గా మారగా.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన.
మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్‌ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల ముందే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు దోహదపడిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
కాగా, ఇవాళ జరిగిన పోలింగ్‌లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవంతో కలుపుకొని 1484 పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు 723 మంది, బీజేపీ 132 మంది, ఇతరులు 339 మంది గెలుపొందారు.


