breaking news
Telangana panchayat elections 2025
-
‘మా సర్పంచ్ ఎవరయ్యా?..’ ఆ ఊరిలో అయోమయం
తెలంగాణ వ్యాప్తంగా నేడు పంచాయతీ కార్యవర్గం కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు ప్రమాణం చేయబోతున్నారు. ఈ తరుణంలో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆ గ్రామంలో మాత్రం అయోమయం నెలకొంది.వేములవాడ రూరల్ మండంలోని చింతల్‌ఠాణా గ్రామం పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ ఊరి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన చెర్ల మురళి నామినేషన్ వేశాక గుండెపోటుతో మరణించారు. దీంతో అధికారులు ఆ సమయంలో ఏం చేయలేకపోయారు. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో 370 ఓట్ల మెజారిటీతో ఆయనే గెలిచారు. దీంతో మృతి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా విజయం సాధించిన గ్రామంగా చింతల్‌ఠాణా రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది. అయితే.. గెలిచిన అభ్యర్ధి భౌతికంగా లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫలితాలు వెల్లడించిన రోజునే అక్కడి అధికారులు నివేదిక పంపారు. అయితే ఇప్పటిదాకా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో.. ఇవాళ చింతల్ ఠాణాలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఉప సర్పంచ్ కు తాత్కాలికంగా సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తారా? లేదంటే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో గ్రామస్థులు ఉండిపోయారు. అధికారులు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెబుతుండడం గమనార్హం. -
2029లోనూ ఇవే ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 12,702 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 7,527 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 808 చోట్ల రెబల్ అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. మొత్తం 8,335 (66 శాతం) పంచాయతీలను తమ పార్టీ కైవసం చేసుకుంటే.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా 33 శాతం పంచాయతీల్లోనే విజయం సాధించాయని అన్నారు.ఒక శాతం పంచాయతీల్లో వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, వివేక్ వెంకటస్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, కుంభం అనిల్‌కుమార్, జయవీర్, నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.ఇది మా రెండేళ్ల పాలనపై తీర్పు‘పంచాయతీ ఎన్నికలు 94 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగితే.. అందులో 87 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కానీ బీఆర్ఎస్ 6 నియోజకవర్గాల్లో, బీజేపీ ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యం కనబరిచాయి. 2023 ఎన్నికలతో పోలిస్తే మా బలం గణనీయంగా పెరిగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్న సందర్భంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఘన విజయం కట్టబెట్టారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతోనే ఈ విజయం సాధ్యమైంది. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా, వివాదాలు, అధికార దురి్వనియోగం లేకుండా.. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిబ్బంది నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు మా రెండు సంవత్సరాల పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.మేము అమలు చేస్తున్న సన్న బియ్యం, ఉచిత కరెంటు, సన్న వడ్లకు బోనస్, రూ.500కే సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన ఇతర పథకాలు, కార్యక్రమాల వల్ల ప్రజలు మమ్మల్ని ఆదరించారు. గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్లుగా మేం ఏనాడూ వ్యవహరించ లేదు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించాం. ఎవరినీ నిర్బంధించ లేదు., ప్రతిపక్షాలపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాం. ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి’ అని సీఎం అన్నారు.ప్రతిపక్షానికి అసూయ, అహంకారం పోవడం లేదు..‘ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నా ప్రతిపక్షానికి అహంకారం, అసూయ పోవడం లేదు. బుద్ధి రావడం లేదు. ఒకాయన కడుపులో మూసీ కాలుష్యం కంటే ఎక్కువ విషం కనిపిస్తోంది. ఫలితాలు వారికి వ్యతిరేకంగా ఉన్నాసరే.. వచ్చిన ఫలితాలతోనే జబ్బలు చరుచుకుంటున్నారు. వారు అనుకున్నట్లే.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారికి ఇవే ఫలితాలు వస్తాయి. మేం 2/3 మెజారిటీ సాధిస్తాం. వారికి 1/3 వంతు సీట్లు మాత్రమే వస్తాయి. మీ కోపంతో, అసూయతో ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకోవద్దు. మేం తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నాం. రూ.3.87 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.కేసీఆర్ లేఖ రాస్తే..‘ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ లేఖ రాస్తే.. అసెంబ్లీని సమావేశపరిచి గోదావరి, కృష్ణా జలాల్లో ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువగా అన్యాయం జరిగింది. తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రాకు 511 టీఎంసీలు ఇచ్చేలా చేసుకున్న ఒప్పందం పత్రాలను బయటపెడ్తాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన నియోజకవర్గంలో అధిక పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఆయన చర్చకు వస్తానంటే ఎక్కడైనా రావడానికి సిద్ధం..’ అని రేవంత్ అన్నారు.అసెంబ్లీలో చర్చించాకే ‘పరిషత్’ ఎన్నికలపై నిర్ణయం‘జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలన్న అంశంపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో మాకు సంబంధం లేదు. బీఆర్ఎస్కు స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. మేము మీ పిల్లలమే అని ఎమ్మెల్యేలు అంటుంటే..కాదు పో.. అని ఎవరైనా అంటారా? ఆ ఎమ్మెల్యేల వేతనాల నుంచి రూ.5 వేలు టీఆర్ఎస్ఎల్పీకి తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున స్పీకర్ బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 37 అంటుంటే వారు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. 37 మంది ఎమ్మెల్యేలకు మాట్లాడడానికి తగిన సమయం ఇవ్వడం లేదని హరీశ్‌రావు అన్నారు..’ అని సీఎం చెప్పారు. -
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. డీఎస్పీకి గాయాలు.. జగిత్యాలలో పోలీసు కాల్పులు
సాక్షి,జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. పోలీసు సిబ్బందికీ గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడకు చేరుకుని.. ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగాయి. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొనడంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన పోలీస్ పహారాలో బ్యాలెట్ బాక్సులను తరలించారు. -
హస్తం.. హ్యాట్రిక్
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంలో హుషారు రేకెత్తించేలా గ్రామీణ ఓటరు తీర్పు ఇచ్చాడు. ఇంకోవైపు బీజేపీలోనూ ఈ ఎన్నికలు జోష్ పెంచాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుని అధికార పార్టీ అగ్రస్థానంలో నిలవగా, బీఆర్ఎస్, బీజేపీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.అయితే స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈసారి గణనీయ సంఖ్యలో విజయం సాధించడం గమనార్హం. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం.ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో మూడో వంతు స్థానాల్లో తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించడం.. ప్రభుత్వ పనితీరుపై, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వచ్చిన స్పందనగా అధికార పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని చెబుతున్నారు.అయితే అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని తట్టుకుని తాము బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాల్లో విజయం సాధించారని, ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తెలియచేస్తోందని విపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మరింత జోరు కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిసారిగా వందల సంఖ్యలో పంచాయతీల్లో పాగా వేయడంపై బీజేపీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో మరిన్ని స్థానాలు గెలిస్తే బావుండునన్న అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. 1205 పంచాయతీలు ఏకగ్రీవం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో 12,728 గ్రామపంచాయతీలకు గాను ఏకగ్రీవాలు 1205 పంచాయతీలు, నామినేషన్లు వేయని పంచాయతీలు 21, కోర్టు స్టేలతో ఎన్నికలు జరగని 5 స్థానాలను మినహాయిస్తే 11,497 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు 7135 పంచాయతీల్లో విజయం సాధించారు.ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 3508 పంచాయతీల్లో గెలుపొందగా, బీజేపీ దాదాపు 674 గ్రామాల్లో పాగా వేసింది. ఇలావుండగా.. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు తమ సత్తా చాటారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలను ధీటుగా ఎదుర్కొని 1385 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు. -
కొత్త సర్పంచ్ల పదవి ప్రమాణస్వీకారం తేదీలో మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కి మార్చింది.తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే సరైన ముహూర్తాలు లేవని.. కావున అపాయింటెడ్ డే ను ఈ నెల 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో అపాయింట్మెంట్ డేను రెండు రోజుల పాటు వాయిదా వేసి, డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులు అదే రోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. -
తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా
మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..?
రెండో విడత పంచాయతీ ఫలితాల్లోనూ..తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనేక సర్పంచ్ స్థానాలకు సమాన ఓట్లు రాగా, లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. పోటీలో ఉన్న వారి మేరకు విజ్ఞప్తి మేరకు రెండుమూడుసార్లు రీకౌంటింగ్ కూడా చేశారు. ధర్మసాగర్/ హవేళిఘణాపూర్/అనంతగిరి/ వేములపల్లి /పుల్కల్/ ఎల్లారెడ్డిరూరల్/ కౌటాల/కాసిపేట: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో ఎండీ సత్తార్, బీఆర్ఎస్ మద్దతుతో హఫీజ్ పోటీ చేశారు. 328 ఓట్లు పోల్ అవగా, సత్తార్, హఫీజ్‌లకు సమానంగా 164 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సత్తార్‌ను విజయం వరించింది. టాస్ వేయాల్సి ఉండగా, డ్రా ఎందుకు తీశారని బీఆర్ఎస్ మద్దతుదారు హఫీజ్ నిరసన తెలుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మెదక్ మండలం చీపురుదుబ్బతండా సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బీమిలి, కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీయగా.. సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది. వికారాబాద్ మండలం జైదుపల్లి సర్పంచ్‌గా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్లోళ్ల మౌనిక, నాగిరెడ్డికి 302 చొప్పున ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహించగా మౌనికను అదృష్టం వరించింది.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఓట్లు సమానం రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన ఉపేంద్రమ్మ సర్పంచ్ అయ్యారు.సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు సమానమైన ఓట్లు పొందారు. దీంతో అధికారులు టాస్ వేశారు. టాస్‌లో శ్రీకాంత్‌ను విజయం వరించింది.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళి సంతోశ్‌కుమార్, పెంట మానయ్యలకు సరి సమానంగా 483 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి మంగళి సంతోశ్‌కుమార్ సర్పంచ్‌గా గెలుపొందినట్టుప్రకటించారు.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ స్థానానికి జరగిన ఎన్నికలో బీఆర్ఎస్ బలపర్చిన రజినికాంత్‌కు 204 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడితండా(కే) గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన బలరాం రాంచందర్‌లకు 193 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. రీకౌంటింగ్ జరిపినా అవే ఓట్లు వచ్చాయి. డ్రాలో బలరాంను అదృష్టం వరించింది.నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెంకాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో వెంకటేశ్వరమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో ఆలేటి ఇందు పోటీ చేశారు. ఇద్దరికి చెరి 236 ఓట్లు రాగాటాస్ వేయగా వెంకటేశ్వరమ్మ గెలిచారు. -
తొలిలాగే మలి!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపుగా తొలి విడత ఫలితాలే పునరావృతమయ్యాయి. మొదటి విడత తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించారు. ఆదివారం రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. మరోవైపు స్వతంత్రులు, సీపీఎం, సీపీఐ పారీ్టలకు చెందిన వారు.. 429 మంది గెలుపొందారు. వీరు మొత్తం స్థానాల్లో 11 శాతానికి పైగానే గెలుపొందడం విశేషం. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 4,500 దాటింది. బీఆర్ఎస్ బలపర్చిన 2,300 మంది విజయం సాధించగా, బీజేపీ బలపర్చిన వారు 440 మంది వరకు గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎవరికి ఎంత శాతం..?తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలో కూడా 55 శాతం వరకు పంచాయతీలు కాంగ్రెస్ బలపర్చిన వారికే దక్కగా, అదే సమయంలో బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచి్చంది. ఆ పారీ్టకి 29 శాతం కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. బీజేపీ మద్దతిచి్చన వారు 6 శాతానికి పైగా విజయం సాధించారు. -
కాంగ్రెస్ అక్రమాలపై ప్రజాతీర్పు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, కాంగ్రెస్ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వెంటే నిలిచారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఈ నెల 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలవడమే దీనికి నిదర్శమన్నారు. కాంగ్రెస్ ప్రలోభాలు, బెదిరింపులు తట్టుకుని ప్రజల మద్దతుతో తమ పార్టీ అభ్యర్థులు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు శనివారం నందినగర్ నివాసంలో కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ నేతలు, సర్పంచ్‌లు వందలాదిగా తరలిరావడంతో నందినగర్ నివాసం సందడిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సర్పంచ్‌లుగా గెలుపొందిన వారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడం కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచ్‌లు ఉన్నారు. మరో వారం, పదిరోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచ్‌లను కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్ యాదవ్‌తో కేటీఆర్ లంచ్ హైదరాబాద్ మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ చేశారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు. కేఫ్ యజమాని శరత్ ఇద్దరు నేతలకు ఘన స్వాగతం పలికి లంచ్ ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేశ్.. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను విజయవంతంగా నడుపుతుండటంపై యజమాని శరత్, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కాగా, లంచ్ అనంతరం కేటీఆర్, అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు. -
నేడే రెండో దశ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 29,917 వార్డుసభ్య స్థానాలకు 71,071 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మర్నాడు ఆ ఎన్నికను చేపడతారు. రెండో విడతకు సంబంధించి 5 చోట్ల సర్పంచ్ స్థానాలతోపాటు 108 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. అలాగే రెండు సర్పంచ్ స్థానాలు, 18 వార్డు ఎన్నికలపై కోర్టులో స్టే ఉండటంతో అక్కడ కూడా ఎన్నికలు జరగట్లేదు. 415 సర్పంచ్ పదవులు, 8,307 వార్డులు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్ వేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌రాణి కుముదిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 3–4 పోటీ రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్ చేశామని తెలిపింది. రెండో విడతలో... మొత్తం మండలాలు నోటిఫై: 193 గ్రామ పంచాయతీలు నోటిఫై: 4,333 వార్డులు నోటిఫై: 38,350 పోలింగ్ స్టేషన్లు: 38,337 రెండోదశలో ఓటర్ల సంఖ్య: 57,22,665 పురుషులు: 27,96,006 మహిళలు: 29,26,306 ఇతరులు: 153 పోలింగ్ జరగనున్న పంచాయతీలు: 3,911 పోలింగ్ జరిగే వార్డులు: 22,917 సర్పంచ్ అభ్యర్థులు: 12,782 వార్డ్ మెంబర్ అభ్యర్థులు: 71,071 ఆర్వోలు నియామకం: 30,661 పోలింగ్ సిబ్బంది: 93,905 మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడు దశల ఎన్నికలకు) వెబ్‌కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు: 3,769 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో: 46,026 -
సర్పంచ్ అభ్యర్థుల పరేషాన్
-
ఒక్క ఓటు తేడాతో విజయం.. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, వనపర్తి: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఘనపూర్ మండలంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో, అక్కడ రీకౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో, ఘర్షణలు నెలకొంది.వివరాల ప్రకారం.. ఘనపూర్ మండలంలోని సోలిపూర్ గ్రామంలో నిన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్థానిక మహిళ, కాంగ్రెస్ అభ్యర్థి సింధు.. బీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి, శ్రేణులు.. రీకౌంటింగ్ చేయాలని ధర్నాకు దిగారు. అనంతరం, రీకౌంటింగ్ చేసినా కూడా ఓడిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ససేమిరా అంటూ నిరసనలు చేపట్టారు. దీంతో, బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.అనంతరం, పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో, పలువురు గాయపడ్డారు. మరోవైపు.. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థిని మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ భారీగా మోహరించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొలివిడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టిషాకిచ్చారు. సర్పంచ్ స్థానాల్లో ఇతరుల కంటే తక్కువ స్థానాల్ని బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ఎంపీ ఈటల రాజేందర్ బిగ్‌షాక్ తగిలింది. ఈటల బలపరిచిన బీజేపీ రెబల్ అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదే సమయంలో బండి సంజయ్ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపుపొందారు. ఈటల రాజేందర్ మద్దతు తెలిపిన ర్యాకం సంపత్ ఓటమి పాలయ్యారు.ప్రస్తుతం ఈ ఘటన పంచాయతీ ఎన్నికల్లో హాట్టాపిగ్గా మారగా.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన.మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల ముందే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు దోహదపడిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.కాగా, ఇవాళ జరిగిన పోలింగ్‌లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవంతో కలుపుకొని 1484 పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 723 మంది, బీజేపీ 132 మంది, ఇతరులు 339 మంది గెలుపొందారు. -
ఎన్నికల టెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల తన్నులాట
సాక్షి, నల్గొండ: తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య దాడి జరిగింది. దీంతో, టెన్షన్ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. నల్లగొండలోని కేతేపల్లి మండలంలో బుధవారం అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొర్లపహాడ్లో రాళ్లు, కత్తులతో ఇరు వర్గాల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయపడటంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, కొర్లపహాడ్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు పోలింగ్, ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్...


