సాక్షి, వనపర్తి: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఘనపూర్ మండలంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో, అక్కడ రీకౌంటింగ్ చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో, ఘర్షణలు నెలకొంది.
వివరాల ప్రకారం.. ఘనపూర్ మండలంలోని సోలిపూర్ గ్రామంలో నిన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్థానిక మహిళ, కాంగ్రెస్ అభ్యర్థి సింధు.. బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, శ్రేణులు.. రీకౌంటింగ్ చేయాలని ధర్నాకు దిగారు. అనంతరం, రీకౌంటింగ్ చేసినా కూడా ఓడిపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ససేమిరా అంటూ నిరసనలు చేపట్టారు. దీంతో, బీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం, పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో, పలువురు గాయపడ్డారు. మరోవైపు.. బీఆర్‌ఎస్ శ్రేణులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థిని మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ భారీగా మోహరించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


