తెలంగాణ నుంచి ఏ ప్రతిపాదనలు రాలేదన్న కేంద్రం
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. హైకోర్టుకు మంజూరైన జడ్జి పోస్టులు 42 కాగా, ప్రస్తుతం 12 ఖాళీలు ఉన్న మాట వాస్తవమేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పార్లమెంట్ వేదికగా అంగీకరించారు. అయితే, ఈ ఖాళీల భర్తీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు కొలీజియం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు.
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2025 డిసెంబర్ 5 నాటికి తెలంగాణ హైకోర్టు నుంచి జడ్జీల నియామకానికి సంబంధించి ఏ ఒక్క ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదన్నారు. నిబంధనల ప్రకారం ఖాళీ ఏర్పడటానికి 6 నెలల ముందే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కానీ, ఈ గడువు చాలా అరుదుగా మాత్రమే అమలవుతోందని మంత్రి తెలిపారు.


