ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్
నేటి ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట లొంగిపోవాలని ఆదేశం
కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది.
తక్షణమే ఆయన విచారణాధికారుల ఎదుట లొంగిపోవాలని, కస్టోడియల్ విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. కస్టడీ సమయంలో ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, శారీరక హింసకు గురిచేయకూడదని చెప్పింది. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.
ఆధారాలు ధ్వంసం చేశారు..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ప్రభాకర్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, సాక్ష్యాధారాలను పకడ్బందీగా ధ్వంసం చేశారని చెప్పారు. 2023 నవంబర్ 29న ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభాకర్ రావు సంతకంతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేశారని తెలిపారు. 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, డిసెంబర్ 2న రికార్డులన్నింటినీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారని చెప్పారు.
డిసెంబర్ 4న ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా చేశారని, వెళ్లేముందు కంప్యూటర్ల నుంచి 50 పాత హార్డ్‌డిస్క్‌లను తీయించి, వాటిని కట్టర్లతో కోయించి నదిలో పారేయించారన్నారు. ‘ఆయన చాలా తెలివైన అధికారి.. ఆధారాలు లేకుండా చేశారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు.
కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్తామన్నారు
ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు) 2021లో చేసిన ప్రసంగాన్ని ఆయన కోర్టులో చదివి వినిపించారు. ‘ప్రభాకర్ రావు.. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉన్నా సరే, హోంగార్డును పంపి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తాం’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారని, ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నారని రంజిత్ కుమార్ వాదించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఇంటి భోజనానికి, మందులకు అనుమతించాలని కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది.
‘క్రిమినల్స్ మధ్య 30 ఏళ్లు పనిచేశారు.. జాగ్రత్త!’
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఎంతోమంది నేరస్తులను డీల్ చేసి ఉంటారు. కాబట్టి కస్టడీలో ఆయనకు ఎలాంటి శారీరక హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని పోలీసుల తరఫు న్యాయవాదికి సూచించింది. అయితే, ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని, చట్టం అందరికీ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు.


