సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన బిల్లు ముసాయిదాను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉండి, రైతుల ప్రయోజనాలను కాలరాస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి రావడం, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు లేకపోవడం, రాష్ట్రాలకు విత్తన ధరలపై నియంత్రణ అధికారం లేకుండా పోవడం, సాంప్రదాయ రైతు విత్తన హక్కులకు రక్షణ లేకపోవడం వంటి తీవ్ర లోపాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బిల్లు దేశీయ విత్తనభద్రత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, రాజకీయ పార్టీలతో చర్చించకుండా ఈ బిల్లును రూపొందించడం సరికాదని, వెంటనే ఆపివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ తరఫున సుదీర్ఘ ఫీడ్‌బ్యాక్‌తోపాటు సవరణలు సైతం కేంద్రానికి పంపినట్టు తెలిపారు.
నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు గరిష్ట ఉత్పత్తి మేరకు నిర్దిష్ట సమయంలో నష్టపరిహారం అందేలా కఠిన నిబంధనలు పెట్టాలని, రాష్ట్రాల అధికారాలను కాపాడాలని సూచించారు. త్వరలో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కేంద్రానికి మరిన్ని సూచనలు పంపనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు.


