‘కేబినెట్ హోదా’ను సవాల్ చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజాప్ర యోజన వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌ను ఈ పిటిషన్‌కు జత చేయాలని స్పష్టం చేసింది. ఈ రెండు పిల్‌లపై సీజే ధర్మాసనం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
పలువురికి ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తిన రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఫైలింగ్ నంబర్‌పైనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 2017లో అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇదే ‘కేబినెట్ హోదా’ అంశంపై పిటిషన్ వేశారని, అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టినా ప్రయోజనం లేదని చెప్పారు.
రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఓ నిర్ణయం తీసుకుంటారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తారని చెప్పారు. ఆర్టికల్ 164 (1ఏ) ప్రకారం మంత్రివర్గ హోదా కల్పించే విషయంలో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదన్నారు. ప్రస్తుతం 16 మంది కేబినెట్ మంత్రులకు అదనంగా ప్రభుత్వంలోని 14 మంది ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు ఆ హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నా రు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు.


