సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని ‘నవోదయ’సరికొత్త ఆలోచన
విద్యాలయంలో మ్యాథ్స్ థీమ్ పార్క్ ఏర్పాటు
ఓపెన్ స్పేస్ లర్నింగ్ ద్వారా గణిత పాఠాలు.. ఆటలతో విజ్ఞానం
సాక్షి, సిద్దిపేట: ఆల్జీబ్రా.. గుండె గాబరా అనే చందంగా లెక్కలంటే కొందరు విద్యార్థులకు చెప్పలేనంత భయం. పరీక్షల్లో మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధిస్తున్నా మ్యాథ్స్‌లో మాత్రం జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కడం లేదా ఫెయిల్ అవుతూ ఉంటారు. అదే సమయంలో ఆటపాటలను మాత్రం ఎంతో ఇష్టపడుతుంటారు. విద్యార్థుల్లో గణితంపట్ల ఉన్న ఈ భయాన్ని పోగొట్టి లెక్కలంటే ఇష్టం పెంచేందుకు సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని జవహర్ నవోదయ విద్యాలయం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
విద్యాలయం ప్రాంగణంలో దాదాపు 500 గజాల విస్తీర్ణంలో మ్యాథ్స్ థీమ్ పార్కును ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడేలా థీమ్ పార్కును తీర్చిదిద్దింది. తరగతి గదిలో బోధనతోపాటు ఓపెన్ స్పెస్ లర్నింగ్ ద్వారా విద్యార్థులు సులువుగా, త్వరగా అర్థం చేసుకునేలా గణితం ఉపాధ్యాయులు అమ్మని, శేషు, అనిల్ కుమార్ పాఠాలు బోధిస్తున్నారు. వారంలో రెండు క్లాస్‌లను మ్యాథ్స్ పార్క్‌లో ప్రత్యక్షంగా వివిధ ఆకారాలను చూపిస్తూ బోధిస్తున్నారు.
సర్కిల్ తీరంస్, టైప్ ఆఫ్ యాంగిల్స్, ట్రైయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, ఎక్స్‌టర్నల్, పైథాగరస్ పెంటగాన్, కోన్, ట్రైయాంగిల్ ప్రిజం, స్క్వేర్ ప్రిజం, త్రీ డైమన్షనల్ ప్లేన్, సిలిండర్, క్యూబ్, క్యూబాయిడ్, పిరమిడ్ వంటి ఆకారాలతో పార్క్‌ను నిర్మించారు. అందులో ల్యాడర్ గేమ్, ప్రైమ్ ఫాక్టర్స్ ఆటలను ఆడిస్తూ తరగతులు చెబుతున్నారు.
జామెట్రికల్, టూడీ, త్రీడీ, సాలిడ్ ఫిగర్స్, క్షేత్ర సమితి, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, సమాంతర రేఖలు, గ్రాఫ్‌లపై విద్యార్థులకు మెరుగైన అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు పార్క్ మధ్యలో ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సులభంగా అర్థమవుతోంది
మ్యాథ్స్ థీమ్ పార్క్‌లో వివిధ తీరంస్‌ను చూపిస్తూ ప్రత్యక్షంగా బో«ధించడంతో సులభంగా అర్థమవుతోంది. వివిధ యాంగిల్స్ గురించి ఇలా నేర్పించడంతో ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఓపెన్ స్పేస్ లర్నింగ్ ఎంతో ఉపయోగపడుతోంది. – అఖిలేష్, 7వ తరగతి
ఓపెన్ లర్నింగ్‌లో భాగమే..
విద్యార్థులు చూస్తూ నేర్చుకోవడంతో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విద్యార్థులకు తరగతి గదిలోనే బోధన కాకుండా ఓపెన్ లర్నింగ్ ద్వారా విద్యను అందిస్తున్నాం. హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీలో భాగంగా మ్యాథ్స్ పార్క్‌ను నిర్మించాం. పీఎంశ్రీ పథకం, పాఠశాల నిధులతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశాం. – రాజేందర్, ప్రధానోపాధ్యాయుడు, నవోదయ విద్యాలయ, వర్గల్


