సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్ కస్టడీ కారణంగా రవి బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు..
మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్‌ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్ పిటిషన్‌నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు.
సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్ పోలీసుల కస్టడీ అప్పీల్ గనుక రిజెక్ట్ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది.


