పటాన్‌చెరు టౌన్: ముత్తూట్ ఫైనాన్స్‌కు ఓ బాధితుడు తాళం వేశాడు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ముత్తంగి గ్రామానికి చెందిన సాయి జీవన్ కుమార్ ఇటీవల ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం తాకట్టు పెట్టి రూ.9.51 లక్షలు రుణం తీసుకున్నాడు. డబ్బు సమకూరడంతో రుణం తిరిగి చెల్లించాలనుకున్నాడు. ఈ విషయం మేనేజర్‌కు చెప్పాడు. ఆయన సలహా మేరకు ముత్తూట్ ఫైనాన్స్ అకౌంట్‌కు రూ.9.51 లక్షలతో పాటు వడ్డీ మొత్తం తన బ్యాంక్ ఖాతా నుంచి ఆర్టీజీఎస్ చేశాడు.
కానీ బాధితుడికి బంగారం తిరిగి ఇవ్వలేదు. పలుమార్లు మేనేజర్‌ను కలిసి విన్నవించినా సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు.. బుధవారం ఫైనాన్స్‌కు వెళ్లాడు. మేనేజర్ లేకపోవడంతో సిబ్బందిని నిలదీశాడు. వారి నుంచి కూడా సరైన సమాధానం లేకపోవడంతో ఫైనాన్స్ ప్రధాన ద్వారానికి తాళం వేశాడు. దీంతో ఫైనాన్స్ సిబ్బంది పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తాళం తీయించి సిబ్బందిని బయటకు పంపించారు. వివరణ కోసం మేనేజర్‌ను ప్రయతి్నంచగా ఆయన అందుబాటులోకి రాలేదు.


