నిజాయితీ చాటుకున్న మహిళ
● బస్సులో దొరికిన బ్యాగ్ పోలీసులకు అప్పగింత ● అందులో 4 తులాల బంగారం,పాస్‌పుస్తకాలు
జిన్నారం (పటాన్‌చెరు): ఓ మహిళ నిజాయితీ చాటుకుంది. తనకు దొరికిన బంగారు గొలుసు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కవిత బుధవారం ఉదయం ఐదు గంటలకు బొల్లారం నుంచి హనుమకొండకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు కొద్ది దూరం వెళ్లాక చేతికున్న హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోయింది. బ్యాగు కోసం బస్సులో వెతికినా లభించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది. బ్యాగులో రూ.5లక్షల విలువ గల నాలుగు తులాల విలువైన బంగారు గొలుసు, పాస్ పుస్తకాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే.. బొల్లారానికి చెందిన మంజులకు బ్యాగు దొరకడంతో వస్తువులను చూసి అందులో ఉన్న కవిత ఫోన్ నంబర్కు అసలు విషయం తెలిపింది. వెంటనే బాధితులకు పోలీసుల సమక్షంలో బంగారు గొలుసు పాస్ పుస్తకాల బ్యాగును అందజేసింది. నిజాయితీని చాటుకున్న మహిళను పోలీసులు అభినందించగా బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.


