పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
● 161 సమస్యాత్మక ప్రాంతాలు
● విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు
హత్నూర( సంగారెడ్డి): జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం మండల కేంద్రమైన హత్నూర గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో అధికారులకు ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. మొదటి విడత ఎన్నికల్లో 161, రెండో విడతలో 566 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. సామగ్రి తీసుకునే సమయంలో ఆలస్యం చేసిన వారికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. జోనల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, సమస్యలు ఉత్పన్నమైతే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంపీడీవో శంకర్, ఎంపీఈఓ యూసుఫ్ ఉన్నారు.


