ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
సీఐటీయూ అధ్యక్షుడు చుక్కా రాములు
పటాన్‌చెరు టౌన్: రాబోయే రోజుల్లో లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికవర్గమంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాము లు అన్నారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే కాలంలో నాన్ పర్మినెంట్ ఉద్యోగులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, యాజమాన్యాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ అఖిల భారత జాతీయ మహాసభల సందర్భంగా డిసెంబర్ 15న అన్ని పారిశ్రామిక ప్రాంతాలలో, గ్రామాల్లో, నివాస ప్రాంతాలలో సీఐటీయూ జెండాలను ఎగురవేసి ఫ్లాగ్ డే నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పాండు రంగారెడ్డి, ఎం.మనోహర్, వీరారావు, సదాశివరెడ్డి, సత్తిబాబు, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.


