పగలు ప్రచారం.. రాత్రి మంత్రాంగం
ప్రతిష్టాత్మకం
● పల్లెల్లో సర్పంచ్ అభ్యర్థుల ఆపసోపాలు
● గెలుపుకోసం విశ్వ ప్రయత్నాలు
● జోరుగా మలి, చివరి విడత ప్రచారం
నారాయణఖేడ్: తొలి విడత ఎన్నికల పర్వం ముగియడంతో మలి, చివరి దశ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రచార పర్వంలో దూసుకు పోతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చూపుతూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం ప్రచారం.. రాత్రిళ్లు మంతనాలు సాగిస్తున్నారు. ఎలాగైనా తాము గెలవాలన్న లక్ష్యంతో ఉన్న అవకాశాలను వాడుకుంటున్నారు. రెబల్స్ బెడద ఉన్న చోట ప్రత్యర్థి వర్గం నుంచి తమకు ఓట్లు వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ పార్టీలో ఉంటూ రెబల్స్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యక్తికి మద్దతు ఇస్తున్న వారిని ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎవరు చెబితే వింటారో అంటూ ఆలోచిస్తూ ఆయా వ్యక్తులు, పార్టీల నాయకులతో మాట్లాడించి మద్దతు కూడగడుతున్నారు. ఈ ఒక్కసారి తమకు మద్దతు ఇవ్వాలని.. అందుకు ప్రతిఫలంగా ఏం కావాలో చెప్పాలంటూ అడుగుతున్నారు. చాలా చోట్ల ఆర్థిక హామీలతోనే అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. దీంతో చాలా పంచాయతీల్లో ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకులు, ఓటర్లు సాయంత్రానికి పార్టీ మారుతున్నారు. కొందరు కుటుంబాలను, కులాలను కూడా చూపుతూ తమ మద్దతు తెలపాలని వేడుకుంటున్నారు.
జోరుగా దావత్‌లు
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు ఉదయం వ్యవసాయ క్షేత్రాలు, కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి వస్తుండడంతో ఉదయం, సాయంత్రం ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. తమ వెంట తిరిగే కార్యకర్తలు, అభిమానులకు మధ్యాహ్నం సమయంలో చికెన్ రైస్, లేదా చికెన్ బిర్యానీలు తినిపిస్తున్నారు. రాత్రి సమయాల్లో దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చీప్‌లిక్కర్ తాగేవారు కూడా బ్రాండెడ్ మందు అడుగుతున్నారని కొందరు అభ్యర్థులు గుసగుసలాడుతున్నారు.
పంచాయతీ పోరును వివిధ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత పంచాయతీ పాలకవర్గాల్లో బీఆర్‌ఎస్ మద్దతుతోనే ఎక్కువ మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పెద్ద నాయకులు పంచాయతీ పోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెల్లో ప్రజాప్రతినిధులు ఉంటే పార్టీకి పట్టు ఉంటుందని, మరోసారి ఎన్నికల్లో విజయం సులువు అవుతుందని తెలుపుతూ ప్రతీ చోట కాంగ్రెస్ విజయం సాధించాలని సూచిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మొత్తమ్మీద అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెపోరు వేడెక్కుతోంది.


