నువ్వా.. నేనా..! | - | Sakshi
Sakshi News home page

నువ్వా.. నేనా..!

Dec 12 2025 5:47 PM | Updated on Dec 12 2025 5:47 PM

నువ్వ

నువ్వా.. నేనా..!

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీ ఫలితాలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హోరాహోరీగా సాగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను గెలుచుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ జిల్లాలో తన పట్టును నిలుపుకొంది. హస్తం పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది. కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్‌ఎస్‌ కాస్త తక్కువ సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుంది. పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

సుమారు 65 సర్పంచ్‌ స్థానాల్లో

కాంగ్రెస్‌ విజయం

తొలి విడతలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్‌, సదాశివపేట మండలాలు, పటాన్‌చెరు నియోజకవర్గంలో పటాన్‌చెరు, గుమ్మడిదల మండలాలు, నర్సాపూర్‌ నియోజకవర్గం హత్నూర మండలంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 136 గ్రామ పంచాయతీలకు గాను ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 129 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్‌ జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ సుమారు 65కు పైగా సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుంది.

బీఆర్‌ఎస్‌కు సుమారు 46 సర్పంచ్‌ స్థానాలు

ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ తన పట్టు నిలుపుకొంది. అధికార పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలవడం సాధారణం. కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు 46 గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా విజయం సాధించారు. కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలిచిన స్థానాలు కాస్త తక్కువే అయినప్పటికీ.. గట్టి పోటీని ఇచ్చింది. దీంతో గ్రామాల్లో పార్టీకి మంచి పట్టుందని నిరూపితమైంది.

స్వతంత్రులు, కమలం పార్టీ సర్పంచులు

బీజేపీ మద్దతు దారులు ఈ ఎన్నికల్లో తమ ఉనికి చాటుకున్నారు. నాలుగు గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు దారులు విజయం సాధించారు. హత్నూర మండలం చందాపూర్‌లో అన్ని వార్డు సభ్యులతో పాటు, సర్పంచ్‌ స్థానాలను గెలుచుకున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ.. పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు కూడా విజయం సాధించారు. ఏ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా బరిలోకి దిగిన ఈ స్వతంత్రులు సుమారు ఏడు చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం.

మాజీలు, తాజామాజీలే అధికం

చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులుగా మాజీలు, తాజా మాజీలే బరిలో నిలిచారు. రిజర్వేషన్లు కలిసి రాని అతికొన్ని పంచాయతీల్లోనే కొత్తవారు పోటీ చేశారు. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగింది.

హస్తం పార్టీ మద్దతుదారులదే పైచేయి

పట్టునిలుపుకొన్న గులాబీ పార్టీ మద్దతుదారులు

పలు చోట్ల సత్తా చాటిన స్వతంత్రులు

ఉనికిని చాటుకున్న బీజేపీ మద్దతుదారులు

కౌంటింగ్‌ ప్రక్రియ పరిశీలన

సంగారెడ్డి జోన్‌: తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య పరిశీలించారు. గురువారం కొండాపూర్‌ మండల పరిధిలోని మల్లేపల్లిలో కౌంటింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. కౌంటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజేందర్‌ పాల్గొన్నారు.

నువ్వా.. నేనా..!1
1/1

నువ్వా.. నేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement