ఓటెత్తిన పల్లె
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పల్లె ఓటరు ఓటెత్తారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువత ఉత్సాహంగా ఓటేశారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల్లో పోలింగ్ జరిగింది. ఏకగ్రీవం అయిన సర్పంచు స్థానాలు ఏడు మినహాయిస్తే 129 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరిగింది. అలాగే ఏకగ్రీంగా ఎన్నికై న 113 వార్డు సభ్యుల స్థానాలను మినహాయించి 1,133 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ప్రారంభంలో మందకొడిగా..
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి గంట సేపు పోలింగ్ మందకొడిగా సాగింది. 8 గంటల నుంచి ఊపందుకుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. హైదరాబాద్, కర్నాటక, మహరాష్ట్ర వంటి చోట్లకు ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన పల్లె ఓటర్లు తమ సొంత గ్రామానికి చేరకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను సర్పంచు అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ఎన్నికల సరళిని పరిశీలించారు.
పలుచోట్ల ఆలస్యంగా కౌంటింగ్
పోలింగ్ ముగిసిన తర్వాత భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతో కొన్ని గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను వేరు చేసి 25 బ్యాలెట్ పేపర్లకు ఒక కట్ట కట్టారు. ఆ తర్వాత ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించారు. ముందుగా వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచు పదవుల ఫలితాలను ప్రకటించారు. ఓట్లు తక్కువగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఫలితాలు వచ్చాయి. మండల కేంద్రాలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు ఫలితాలు వచ్చాయి.
భారీగానే పోలింగ్
తొలివిడత పోలింగ్ భారీగానే నమోదైంది. ఏకంగా 87.96 శాతం నమోదైంది. హత్నూర మండలంలో అత్యధికంగా 90.06 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యల్పంగా పటాన్‌చెరులో 84.21 శాతం ఓట్లు పోలయ్యాయి.


