తొలి పోరు నేడే
తేలనున్న సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
సామగ్రిని సరిచూసుకుంటున్న పోలింగ్ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది బుధవారమే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్‌బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని తీసుకొని కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. సుమారు 3,500 మంది ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
394 మంది సర్పంచ్ అభ్యర్థులు
మొదటి విడతలో సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల పరిధిలోని 136 గ్రామ పంచాయతీల సర్పంచులు, 1,246 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఏడు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవం కాగా, 129 గ్రామాల సర్పంచ్ పదవులకు నేడు పోలింగ్ జరగనుంది. మొత్తం 394 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,246 వార్డు సభ్యుల పదవుల్లో 113 వార్డులకు ఏకగ్రీవం కాగా, 1,133 వార్డు సభ్యుల పోస్టులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2,849 మంది అభ్యర్థులు వార్డు సభ్యుల పదవులకు పోటీ పడుతున్నారు.
1,100 మందితో మూడు అంచెల భద్రత
గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసుశాఖ మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలింగ్‌తో పాటు, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్పీ పరితోశ్ పంకజ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
2 గంటల నుంచి కౌంటింగ్.. వెంటనే ఫలితాల ప్రకటన
వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది
బరిలో 394 మంది సర్పంచ్, 2,849 మంది వార్డు అభ్యర్థులు
గ్రామ సర్పంచ్ పదవులకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం గురువారం తేలనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. సంగారెడ్డి, హత్నూర తదితర మండలాల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
తొలి పోరు నేడే


