సాక్షి, హైదరాబాద్: ఈనెల 12న విడుదల కానున్న ‘అఖండ–2’సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అను మతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ఆదేశా లు జారీ చేసింది. 12వ తేదీ నుంచి 14 వరకు 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకోవచ్చని స్పష్టంగా పేర్కొంది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
20 శాతం ఆదాయం ఫిల్మ్ వర్కర్ల సంక్షేమానికి..
పెంచిన టికెట్ ధరల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్‌కు జమ చేయాలని థియేటర్ల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని నిర్వహించడానికి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక ఖాతా తెరుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సినిమా ప్రదర్శన సమయంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించే ప్రకటనలు తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.


