అక్టోబర్ నాటికి తెలంగాణలో తొలగించిన కార్డుల చిట్టా విప్పిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 2025లో అక్టోబర్ నెల వరకు కేవలం పది నెలల కాలంలోనే ఏకంగా 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగా వెల్లడించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సహా ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020లో 12,154, 2022లో 4,988, 2023లో 34,064, 2024లో 3,424, 2025లో (అక్టోబర్ వరకు) 1,40,9473 రేషన్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమలులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. నకిలీ కార్డుల ఏరివేత, అనర్హుల గుర్తింపు, కుటుంబ సభ్యుల మరణాలు, శాశ్వత వలసలు వంటి కారణాలతోనే ఈ కార్డులను రద్దు చేసినట్టు రాష్ట్రాలు నివేదించాయని కేంద్రం తెలిపింది. కేవలం ఈ–కేవైసీ లేదా ఆధార్ ధ్రువీకరణ పూర్తి కాలేదన్న ఏకైక కారణంతో ఏ ఒక్క రేషన్‌కార్డునూ రద్దు చేయలేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది.
అంగన్‌వాడీల్లో ఖాళీల మోత
తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత గత మూడేళ్లలో రెట్టింపు అయ్యిందని రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఇచ్చిన సమాధానంలో తెలిపారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ‘పోషణ్ ట్రాకర్’గణాంకాల ప్రకారం తెలంగాణలో అక్టోబర్ 2022 నాటికి 1,344 ఖాళీలు, అక్టోబర్ 2023 నాటికి 1,317 ఖాళీలు, అక్టోబర్ 2024 నాటికి 2,056 ఖాళీలు, అక్టోబర్ 2025 నాటికి 2,757 ఖాళీలు ఉన్నాయి.
2023 అక్టోబర్ నాటికి 1,317గా ఉన్న ఖాళీలు, 2025 అక్టోబర్ నాటికి ఏకంగా 2,757కు చేరాయి. ‘మిషన్ సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ్ 2.0’పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, ఖాళీల భర్తీ విషయమై రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.
మైనారిటీల సంక్షేమంపై నాలుగేళ్లుగా ఒక్క ప్రతిపాదన కూడా రాలేదు
తెలంగాణలో మైనారిటీ సంక్షేమ పథకాల అమలులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం’కింద 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు ప్రతిపాదన కూడా పంపలేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో స్పష్టం చేశారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
మైనా రిటీ విద్యార్థులకు ఆసరాగా నిలిచే ప్రీ–మెట్రిక్, పోస్ట్– మెట్రిక్, మెరిట్–కమ్–మీన్స్ స్కాలర్‌షిప్‌ల అమలుకు 2021–22 తర్వాత అనుమతి ఇవ్వలేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఎన్‌ఎండీఎఫ్‌సీ ద్వారా కెనరా బ్యాంక్ సహకారంతో ఇస్తున్న రుణాల సంఖ్య దారుణంగా పడిపోయిందని.. 2022–23లో 669 మందికి రూ. 6.08 కోట్ల రుణాలు ఇవ్వగా.. 2024–25 నాటికి లబ్ధిదారుల సంఖ్య కేవలం 8 మందికి (రూ. 4 లక్షలు) పడిపోయిందన్నారు.
పోలీసులకు కేంద్రం మొండిచేయి
నార్కోటిక్స్, సైబర్ బ్యూరోలకు నిధులు ఇవ్వలేం
తెలంగాణలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను బలోపేతం చేసేందుకు నిధులు కావాలన్న రాష్ట్ర అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది.
ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘పోలీసుల ఆధునీకరణ పథకం’కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ పరిమితికి మించి ఈ అభ్యర్థన ఉందని, అందుకే దీనిని పరిగణనలోకి తీసుకోలేమని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వల్లే 17 రైల్వే పనుల్లో జాప్యం
తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి భూసేకరణ జాప్యం వల్లే రైల్వే ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్రం తేల్చిచెప్పింది. తెలంగాణకు మొత్తం 63 ఆర్వోబీ పనులు మంజూరు కాగా, అందులో 17 పనులు రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే ఆలస్యమవుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ స్పష్టం చేశారు.
లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ వంశీకష్ణ గడ్డం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇందులో 16 చోట్ల భూసేకరణ సమస్యలు ఉండగా, ఒకచోట అలైన్‌మెంట్ ఖరారు కావాల్సి ఉందన్నారు. భూసేకరణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటేనే పనులు వేగవంతం అవుతాయని మంత్రి పేర్కొన్నారు.


