న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని త్రిసభ్య కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయింది. సీఐసీతో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్ల పేర్లను ఖరారు కూడా ఈ భేటీలో చేసినట్టు సమాచారం. అయితే ఈ పేర్లను కమిటీ సభ్యుడైన విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ఈ మేరకు తన అసమ్మతితో లేఖ కూడా సమర్పించారు.
అభ్యర్థులకు సంబంధించి రాహుల్ మరిన్ని వివరాలు కోరినట్టు సమాచారం. వారి ఎంపికకు అనుసరించిన ప్రాతిపదికను కూడా ఆయన ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భేటీలో కమిటీ సభ్యుడైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. సమాచార హక్కు చట్ట సంబంధిత వివాదాల పరిష్కారానికి అంటున్న అపెలెట్ విభాగమైన సీఐసీలో ప్రస్తుతమిద్దరే కమిషనర్లున్నారు. సీఐసీతో పాటు 8 ఖాళీలున్నాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు పదేపదే కేంద్రానికి తలంటిన నేపథ్యంలో ఖాకీల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. సీఐసీ పదవి కోసం 81 మంది, కమిషనర్ పోస్టులకు 161 మంది దరఖాస్తు చేసుకున్నారు.


