పని గంటల తర్వాత ‘నో ఆఫీస్ కాల్స్’
కాల్స్ తిరస్కరించే హక్కు ఉద్యోగులకు
క్రమశిక్షణ చర్యలు తీసుకునే వీల్లేదు
నిబంధన ఉల్లంఘిస్తే కంపెనీకి జరిమానా
లోక్‌సభ ముందుకొచ్చిన రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు ప్రత్యేకతలు ఇవే
రిమోట్, హైబ్రీడ్ వర్క్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. విధానం ఏదైనా ఈ డిజిటల్ యుగంలో ఒకవైపు పనిభారం మరోవైపు కెరీర్‌లో పరుగు. వెరసి ఉద్యోగులు విశ్రాంతి కరువై అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తీవ్ర పని ఒత్తిడితో కొందరు ‘కఠిన నిర్ణయాలూ’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్ వచ్చాక ఉద్యోగుల పనితీరు మారింది. గంటలకొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చోవడం ఉద్యోగుల వంతు అవుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే.. పని గంటలు ముగిశాక కూడా ఆఫీస్ నుంచి ఫోన్, వీడియో కాల్స్, మెయిల్స్, సందేశాలకు స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒకవేళ స్పందించకపోతే ఎక్కడ వేటుపడుతుందోనన్న ఆందోళన ఉద్యోగులను వెంటాడుతోంది. దీనికితోడు వారానికి 90 గంటల పని ఉండాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ ఈ ఏడాది ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఓలా భవీశ్ అగర్వాల్ సైతం ఇదే రీతిన స్పందించడంతో పని గంటల విషయంలో భారత్‌లో కార్పొరేట్ కంపెనీల వర్క్‌ప్లేస్ కల్చర్‌కు వారి వ్యాఖ్యలు ప్రతిబింబం అంటూ పెద్ద దుమారమే రేగింది.
వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు తెరపైకి వచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఇటీవల లోక్‌సభలో రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. అధికారిక పని గంటలు ముగిశాక.. సెలవు దినాల్లో పని సంబంధిత కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్, వీడియో కాల్స్‌ను ఉద్యోగులు తిరస్కరించేలా చట్టపరమైన హక్కును కల్పించాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
నిరంతరం అందుబాటులో..
నేటి డిజిటల్ ప్రపంచంలో అధిక పని కారణంగా తీవ్ర మానసిక, భావోద్వేగ, శారీరక ఒత్తి డిని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యతను ప్రోత్సహించడం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ లక్ష్యమని సుప్రియా సూలే చెప్పారు. ‘ఆధునిక వర్క్ కల్చర్‌లో ఉద్యో గులు నిరంతరం అందుబాటులో ఉండటం సర్వసాధార ణమైంది.
స్పందించేందుకు డిజి టల్ సాధ నాలు సౌలభ్యంగానే ఉన్నప్పటికీ కార్మికులు రేయింబవళ్లు ఈ–మెయిల్స్‌ను తనిఖీ చేయ డానికి, సందేశాలకు ప్రతిస్పందించడానికి ఒత్తిడిని అనుభవిస్తున్న సంస్కృతిని కూడా ఈ సాధనాలు సృష్టించాయి’ అని సభ దృష్టికి తీసుకెళ్లారు. పని గంటలకు మించి డిజిటలై జేషన్ ద్వారా విధులు నిర్వర్తించినప్పటికీ అదనపు చెల్లింపులు చేయకుండా కంపెనీలు సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోవడం కూడా ఈ బిల్లు ఉద్దేశమని ఆమె వివరించారు.
అమలుపైనే ఆధారం..
కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిలో రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇది కార్యరూపంలోకి వస్తే వర్క్‌ప్లేస్ కల్చర్ మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఈ బిల్లు ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని కాపాడటం, శ్రేయస్సును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బిల్లు ఉద్దేశం నిజంగా నెరవేరడంపై సందేహం తలెత్తుతోంది.
బిల్లు చట్టంగా మారి ఉద్యోగులకు బలమైన రక్షణ కల్పించినా దీర్ఘకాలంగా పాతుకుపోయిన పని సంస్కృతి నిబంధనలను మార్చడానికి ఇది ఒక్కటే సరిపోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ‘డిస్‌కనెక్ట్ బిల్లు కాగితంపై చాలా బాగుంది. కానీ సంస్థలు అమలు చేసే పని విధానంపై నిజమైన మార్పు ఆధారపడి ఉంటుంది. అవాస్తవిక పనిభారం, సరిహద్దులు లేకపోవడం, పేలవమైన సమయ నిర్వహణ పద్ధతుల వంటి సమస్యలను కంపెనీలు పరిష్కరించకపోతే లొసుగులు రాజ్యమేలతాయి’ అని ఓ సైకాలజిస్ట్ వ్యాఖ్యానించారు.
మూలాన్ని మార్చడం ద్వారా..
రైట్ టు డిస్‌కనెక్ట్‌తో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. పనివేళల్లో ఉత్సాహంగా ఉండటానికి కష్టపడటం, కఠినమైన గడువులను జయించడానికి ఒత్తిడిని ఎదుర్కోవడం లేదా సిబ్బంది కొరత వంటివి ఉద్యోగులు తరచూ ఎదుర్కొనే సవాళ్లను ఈ బిల్లు పరిష్కరించదని నిపుణులు చెబుతున్నారు. ‘చట్టపరమైన నిబంధనలు మాత్రమే కార్యాలయాల్లో పని సంస్కృతిని మార్చలేవు.
సమస్య మూలానికి మందు వేయడం ద్వారా ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యత సాధించవచ్చు. అనుకూలమైన, ఆచరణాత్మకమైన, రోజువారీ వాస్తవాలపై ఆధారపడిన వ్యవస్థలు ఉద్యోగులకు అవసరం’ అని వారు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను అర్థవంతంగా రూపొందించడానికి ఉద్యోగులు, సంస్థలు కలిసి పనిచేయాలన్నది నిపుణుల భావన.
బిల్లులో ఏముందంటే..
» అధికారిక పని గంటల తరువాత, సెలవు రోజుల్లో ఆఫీస్ ఫోన్‌కాల్స్, వీడియోకాల్స్, మెయిల్స్, సందేశాలను ఉద్యోగులు తిరస్కరించవచ్చు.
» స్పందించని సిబ్బందిపై కంపెనీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.
» ఒకవేళ నిబంధనలను కంపెనీ ఉల్లంఘిస్తే.. మొత్తం ఉద్యోగుల వేతనంలో ఒక శాతానికి సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు.
» సిబ్బంది హక్కుల పరిరక్షణకు ప్రత్యేక సంక్షేమ సంస్థ ఏర్పాటు.
» అధికారిక సమయానికి మించి పనిచేసే ఉద్యోగులకు ప్రామాణిక వేతనాల ప్రకారం ఓవర్ టైం చెల్లింపుతో పరిహారం.
» పనివేళల తరువాత ఉద్యోగులను సంప్రదించడానికి పరస్పరం అంగీకరించిన నిబంధనలను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు.


