దేశంలో అత్యున్నత ప్రభుత్వ సర్వీసు అయిన సివిల్స్ పట్ల యువత మొగ్గుచూపుతోంది. ఏటా లక్షలాది మంది యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రమైన ఉద్యోగం, మంచి హోదా, సమాజంలో గౌరవం, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక భాగస్వామ్యం.. వంటి అంశాలు యువతను ఈవైపుకు నడిపిస్తున్నాయి. ఫలితంగా సివిల్స్ రాస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నాణేనికి మరోవైపు చూస్తే.. సివిల్స్ వైపు వచ్చే ఐఏఎస్‌ల పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్న వాదన వినిపిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 2018లో లోక్‌సభలో ప్రసంగిస్తూ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఐఏఎస్ అధికారుల వారసుల్లో చాలా మంది సివిల్ సర్వీసుల్లో చేరడానికి ఆసక్తి చూపడం లేదని, వారు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఐఏఎస్ అధికారులే తనతో స్వయంగా ఈ విషయం చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థుతులను బట్టి చూస్తే ట్రెండ్ అలాగే ఉన్నట్టు కనబడుతోంది. ఈ మార్పును ట్రాక్ చేసే అధికారిక డేటా ఏదీ లేనప్పటికీ.. సోషల్ మీడియాలో వివిధ రకాలుగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అంచనాకు రావొచ్చు.
భిన్నమైన జీవనశైలి
ఐఏఎస్ సాధించడం అనేది ఆశావహులకు జీవితకాల స్వప్నం. సివిల్స్‌లో పాస్ కావడానికి సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తుంటారు. విజేతలను స్ఫూర్తిగా తీసుకుని తమ కలను సాకారం చేసుకునేందుకు శ్రమిస్తుంటారు. కానీ ఐఏఎస్ అధికారుల పిల్లలు దృక్పథం మరోలా ఉంటుంది. ఎందుకంటే తమ తల్లిదండ్రులు అప్పటికే ఐఏఎస్ అధికారులు (IAS Officials) కాబట్టి వారికి ఆ వాతావరణం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఐఏఎస్ అధికారులు ఎలా పనిచేస్తారనే దానిపై అవగాహన ఉంటుంది. దీంతో అలాంటి ఉద్యోగం తమకు సరిపడుతుందో, లేదోనన్నఅంచనాకు వచ్చేస్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. తమ తల్లిదండ్రుల కంటే భిన్నమైన జీవనశైలిని బ్యూరోక్రాట్ పిల్లల్లో ఎక్కువ మంది కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది.
అమెరికాలో చదువుతున్న ఓ సీనియర్ ఐఏఎస్ కుమారుడు మాటలు వింటే కొంత వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ''మా నాన్న తెల్లవారుజామున 2 గంటలకు పనిచేయడం నేను చూశాను. నేను ఆయనను ఆరాధిస్తాను. కానీ దాని ప్రభావం కూడా నాకు తెలుసు. నా సమయం నాదే అనే కెరీర్ నాకు కావాల''ని అతడు అన్నాడు.
కర్ణాటకలో ఓ సీనియర్ మహిళా ఐఏఎస్ కుమార్తె కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ''మా అమ్మ తరం వాళ్లు సమాజంపై ప్రభావం చూపించడానికి ఏకైక మార్గంగా ఐఏఎస్‌ను ఎంచుకున్నారు. టెక్నాలజీ రాజ్యమేలుతున్న మా తరంలో ప్రతిచోట ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అది వాతావరణ సాంకేతికతలో కావొచ్చు. AIలో కావొచ్చు. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కావొచ్చు. దీనికి యూపీఎస్సీ సివిల్స్ మాత్రమే ఏకైక మార్గం కాద''ని అన్నారు.
అంతర్జాతీయ అవకాశాలు
దీన్ని బట్టి చూస్తే తమ తల్లిదండ్రుల ఉద్యోగ జీవితం లాంటి లైఫ్‌స్టైల్ వారు కోరుకోవడం లేదని స్పష్టమవుతోంది. తరచుగా బదిలీలు, రాజకీయ ఒత్తిడి, సుదీర్ఘమైన పనివేళలు వంటి అంశాలు వీరిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్టు కనబడుతోంది. అందుకే వీరి వారసులు అంతర్జాతీయ అవకాశాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్, కన్సల్టింగ్, పబ్లిక్ పాలసీ, పరిశోధన, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లా, డిజైన్, సృజనాత్మక రంగాలలో గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా సాగుతున్నారు. ఫలితంగా ఎక్కువ మంది ఐఏఎస్‌ల పిల్లలు అమెరికా, బ్రిటన్ దేశాల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా స్థాయి ఎక్స్‌పోజర్ కంటే కార్పొరేట్ లేదా రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌లను ఇష్టపడుతున్నారు. దీంతో UPSC కోచింగ్‌లో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అటు తల్లిదండ్రులు కూడా ఈ మార్పును నిశ్శబ్దంగా అంగీకరిస్తున్నట్టు కనబడుతోంది.
యువత ఆలోచనా ధోరణిలో మార్పు
గత దశాబ్ద కాలంలో భారతదేశంలో స్టార్టప్ కల్చర్ (start-up culture) పెరగడం కూడా యువత ఆలోచనా ధోరణిలో మార్పు కనబడుతోంది. ఆలోచనలను అమలు చేసే స్వేచ్ఛ, సరళమైన పని సంస్కృతి, వేగవంతమైన కెరీర్ వృద్ధి, అధిక రాబడులు వంటి అంశాలు స్టార్టప్‌లపైపు యువతను ఆకర్షిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడటం, రాజకీయ నేతల కనుసన్నల్లో మెలగడం వంటి పద్ధతులను పాతవిగా పరిగణిస్తున్నారు. తమ సొంత ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే ప్రొఫెషనల్ స్పెస్‌లను వారు ఇష్టపడుతున్నారు. నేను కలిసిన విద్యార్థుల్లో సగం మంది తమ సొంతంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. ప్రమోషన్ల కోసం 30 సంవత్సరాలు పనిచేయాలనే ఆలోచన వారికి నచ్చదని ఇంటర్న్‌లకు మార్గదర్శకత్వం వహించే ఒక యువ IAS అధికారి చెప్పారు.
చదవండి: శభాష్.. గోలూ భాయ్!
విజయానికి కొత్త నిర్వచనం
యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనేది దశాబ్దాలుగా భారతీయ కుటుంబాల్లో ఉత్కృష్ట విజయంగా పరిగణించబడింది. ప్రస్తుత సమాజంలో ఇలాంటి విజయాలకి నిర్వచనాలు మారుతున్నాయి. ఐఏఎస్ అధికారుల వారసులు సివిల్ సర్వీసులను తిరస్కరించడం లేదు, తమ ఆకాంక్షలను పునర్ నిర్వచిస్తున్నారు. వారి ఎంపికలు భారతీయ సమాజంలో విస్తృత మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వ పదవిలో ఉంటేనే సమాజంలో మార్పు సాధ్యమన్న భావనను నుంచి వారు బయటపడుతున్నారు. కొత్త తరం (New Generation) మితిమీరిన అదుపాజ్ఞల కంటే స్వేచ్ఛను.. భద్రత కంటే ఆవిష్కరణను.. సాంప్రదాయ ప్రతిష్ట కంటే వ్యక్తిగత ఏజెన్సీని ఎంచుకుంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి వ్యవస్థ యొక్క వారసత్వాన్ని పునర్ లిఖిస్తున్నారు.


