కోల్‌కతా, సాక్షి : పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన సందేశ్‌ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో భోలానాథ్ ఘోష్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈకేసుకు సంబంధించి బుధవారం కోర్టుకు వెళుతుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బోయ్‌ఖలి పెట్రోల్ పంప్ సమీపంలో ఒక ట్రక్కు అమిత వేగంతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. ట్రక్కు కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి, సమీపంలోని నీళ్లలోకి నెట్టివేసింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్ (32), కారు డ్రైవర్ సహనూర్ మొల్లా (27) స్పాట్‌లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భోలానాథ్‌ను మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు.
సందేశ్‌ఖాలి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ తనపై దాఖలు చేసిన అనేక కేసుల్లో ఒకదానికి సంబంధించి బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు హాజరు కావడానికి ఘోష్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
చదవండి: మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావా
హత్యకు కుట్ర
ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి అని, తన తండ్రిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్ పెద్ద కుమారుడు బిశ్వజిత్ ఆరోపించారు. షాజహాన్ జైలు నుండే ఈ పథకం వేశాడన్నారు. 2024 జనవరిలో సందేశ్‌ఖాలిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడిలో, అలాగే షాజహాన్‌కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షులలో ఒకరిగా ఉన్నారు.
ఏంటీ సందేశ్‌ఖాలీ కేసు
పశ్చిమ బెంగాల్లోని ఉత్తే 24 పరగణాల జిల్లాలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళలను బంధించి లైంగికంగా హింసించారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం స్పందించలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అంశాన్ని కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు తనిఖీల నిమిత్తం వెళ్లినపుడు షాజహాన్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
షాజహాన్ అనేక కేసులకు సంబంధించి గతంలో అరెస్టు , కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, భూకబ్జాలు, అక్రమ చేపల పెంపకం మరియు వ్యాపారం, ఇటుక బట్టీలను స్వాధీనం చేసుకోవడం, కాంట్రాక్టుల కార్టలైజేషన్, అక్రమ పన్నులు ,లెవీల వసూలు మరియు భూమి ఒప్పందాలపై కమీషన్లపై కేంద్రీకృతమై ఉన్న నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో వివరించింది.
ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో


