శ‌భాష్‌.. గోలూ భాయ్‌! | Bihar man helps an orphan girl on train and later marries her | Sakshi
Sakshi News home page

గోలూ.. నువ్వు గొప్పోడివి!

Dec 10 2025 4:13 PM | Updated on Dec 10 2025 5:07 PM

Bihar man helps an orphan girl on train and later marries her

అనాథ‌కు అండ‌గా నిలిచిన యువ‌కుడిపై ప్ర‌శంస‌లు

భిక్షాటన చేసే యాచ‌కుల‌ను చూసి అయ్యో పాపం అనుకుంటాం. కుదిరితే సాయం కూడా చేస్తాం. చీద‌రించుకునే వారు కూడా ఉంటారు. కానీ ఆ యువ‌కుడు అలా కాదు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స్పందించి అంద‌రి దృష్టిలో హీరోగా నిలిచాడు. అత‌డు చేసిన పని ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఇంత‌కీ ఎవ‌ర‌త‌డు, ఏం చేశాడు?

బిహార్‌లోని బక్సర్ జిల్లాకు (Buxar district) చెందిన గోలు యాదవ్ అనే యువకుడు ఒక రోజు రైలు ప్ర‌యాణిస్తున్నాడు. అదే స‌మ‌యంలో త‌న బోగిలో ఓ అనాథ బాలిక భిక్షాటన చేస్తూ క‌నిపించింది. ప్రయాణికుల అసౌకర్యకరమైన చూపులు, అనుచిత వ్యక్తీకరణల‌ న‌డుమ ఆమెను అలా చూడటం గోలు యాదవ్‌కు బాధ‌నిపించింది. ఆమె కోసం ఏదైనా చేయాల‌ని గ‌ట్టిగా అనుకున్నాడు. క్షణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా ముంద‌డుగు వేశాడు. త‌నతో పాటు ఇంటికి వ‌స్తే బాగా చూసుకుంటాన‌ని ఆమెను అడిగాడు. ఆ బాలిక ఒప్పుకోవ‌డంతో త‌న ఇంటికి తీసుకెళ్లాడు.

ఇంటికి చేరుకున్న తర్వాత.. గోలు ఆ అమ్మాయి దుస్థితిని తన తల్లిదండ్రులకు వివరించాడు. వారు ఆ అమ్మాయిని మ‌న‌స్ఫూర్తిగా స్వాగతించారు. ఆమెకు భ‌ద్ర‌మైన జీవితంతో పాటు ప్రేమ‌ను పంచాల‌ని గోలు భావించాడు. కొద్దిరోజుల త‌ర్వాత‌ త‌ల్లిదండ్రుల అనుమ‌తితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా (Viral) మారడంతో గోలు గొప్ప‌ద‌నం గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది. సంస్కార్ కుమార్ అనే యూజ‌ర్ వీరి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సమాజంలో మంచి మ‌నుషులు ఉన్నార‌ని చెప్ప‌డానికే సోష‌ల్ మీడియాలో కనిపించిన వీరి స్టోరీని తాను పంచుకున్నాన‌ని, మెయిన్ స్ట్రీమ్ మీడియా ధ్రువీక‌రించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.

చ‌ద‌వండి: మా వాళ్లు వ‌ద్దంటున్నారు.. నేను రాజీనామా చేయ‌ను

నెటిజ‌న్ల స్పంద‌న‌
రియ‌ల్ లైఫ్ హీరో అంటూ గోలు యాద‌వ్‌పై నెటిజ‌నులు (Netizens) ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆమెకు ఇల్లు మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవితాన్ని కూడా ఇచ్చాడ‌ని అంటున్నారు. మరీ ముఖ్యంగా నిస్స‌హాయురాలికి ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు ముందుకు రావ‌డం అనేది అత్యంత ప్ర‌శంసార్హ‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. గోలు యాద‌వ్ చేసింది త‌ప్పా, ఒప్పా అనేది ప‌క్క‌పెట్టి.. అత‌డు స్పందించిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement