సాక్షి, ఢిల్లీ: ఇండిగో సంక్షోభం వేళ.. విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచి ప్రయాణికులను దోచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను బుధవారం కోర్టు విచారణ జరిపింది.
ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంటే.. దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు అనుమతి ఎలా లభించింది?. టికెట్ ధరలు kp.35,000 నుంచి 39,000 వరకు ఎలా పెరిగాయి? ఇతర ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి అధిక ధరలు వసూలు చేయడం ఎలా సాధ్యమైంది? ఇది ఎలా జరుగుతుంది? అని జస్టిస్ గెడెలా కేంద్రాన్ని ప్రశ్నించారు.
అయితే.. కేంద్రం చర్యలు తీసుకుందని అదనపు సాలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇండిగో సంక్షోభాన్ని (Indigo) పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే.. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనికి ఎవరు కారణం..? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దాంతో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. ఆ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు.
ఇండిగో వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయింది. పరిస్థితి ముందుగా అంచనా వేయలేకపోయారు. ఇటు ఇతర ఎయిర్‌లైన్సులు ధరలు పెంచుతున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు?.. ఎయిర్‌లైన్స్ అధిక ధరలు వసూలు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు? అని పౌరవిమానయాన శాఖను ఢిల్లీ హైకోర్టు సమగ్ర వివరణ కోరింది.
"మీరు సంక్షోభం ఏర్పడిన తర్వాతే అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రశ్న అది కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. పైలట్‌లపై అధిక పనిభారం ఎందుకు ఉందో, దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కూడా కోర్టు కేంద్రాన్ని కోరింది. అదే సమయంలో.. ఇండిగో తగినంతమంది పైలట్లను నియమించుకోవాలని, ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది.
‘ఇండిగో వందల సంఖ్యలో సర్వీసుల్ని రద్దు చేయడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఆ ఎఫెక్ట్‌తో ఇతర విమానయాన సంస్థల్లో టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ వ్యవహారంపై చాలా ఆలస్యంగా స్పందించిన కేంద్రం.. ఎయిర్‌లైన్స్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ మధ్యలోనే.. ఎయిర్‌లైన్స్‌లు అసాధారణంగా అధిక ధరలు వసూలు చేస్తున్నాయని, ప్రయాణికులకు సమయానికి సమాచారం ఇవ్వడం లేదని.. ఇది ప్రయాణికుల హక్కుల ఉల్లంఘన అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.


