ఆలస్యం లేదు, మళ్లింపులూ లేవు, చాలా రీజనబుల్ కూడా
భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులు ఇపుడిపుడే ఒక కొలిక్కి వస్తున్నాయి. అయితే విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్ల నేపథ్యంలో ఇండిగో పై సోషల్‌మీడియాలో అనేక మీమ్స్, కామెడీ పంచ్‌లు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఇండిగోను విమర్శిస్తూ వచ్చిన ఒక AI-వ్యంగ్య వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
‘‘ఇండిగో కొత్త విమానాలు: ఆలస్యం లేదు, మళ్లింపులు లేవు... చాలా రీజనబుల్’’ అనే శీర్షికతో పోస్ట్ అయిన ఈ వీడియోలో ఇండిగో విమానం మాదిరిగా గానే ఒక ఆటో రిక్షాను మనం చూడవచ్చు. పైలట్ల కొరత, ఒక్క డిసెంబర్‌లోనే 2,000 కంటే ఎక్కువ విమానాల రద్దు, తీవ్రమైన కార్యాచరణ వైఫల్యం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విడియో రావడం గమనార్హం.
IndiGo’s new fleet: no delays, no diversions…. and very reasonable 😃 pic.twitter.com/llHqkloH6T
— Harsh Goenka (@hvgoenka) December 9, 2025
కాగా భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్‌లో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఇండిగో, పైలట్ల కోసం కొత్త పనిగంటలు, నైట్ డ్యూటీలు వారపు విశ్రాంతి పరిమితులను (FDTL) తీర్చడానికి కార్యాచరణ వనరులను సర్దుబాటు చేయకుండా ఇండిగో తన శీతాకాలపు షెడ్యూల్‌లో రోజువారీ విమానాలను 6శాతం పెంచడంతో సమస్యలు తలెత్తాయి.దీంతో ఊహించనరీతిలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడ్డాడు. దీనిపై కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు చేపట్టింది. దీనిపై దర్యాప్తునకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ఇండిగో దేశీయ షెడ్యూల్‌లో 10శాతం కోత విధించాలని మంగళవారం ఆదేశించింది. గతంలో జారీ చేసిన 5శాతం తగ్గింపుతో పోలిస్తే ఇది రెట్టింపు.


