ప్రయాణికులపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తరచు వార్తల్లోకెక్కే ‘వివాద’యాన సంస్థ ఇండిగో... తనకు నచ్చని నిబంధనలు అమల్లోకి రావటాన్ని జీర్ణించుకోలేక వారం రోజులపాటు దేశంలో పౌర విమానయానాన్ని దాదాపు స్తంభింపజేసింది. కనీవినీ ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయి, వేలాదిమంది ప్రయాణికులు దారీతెన్నూ తోచక ఇబ్బందులు పడ్డారు. కనీసం ప్రత్యామ్నాయాలు వెదుక్కుందామన్నా లగేజీ ఆచూకీ దొరక్క నరకయాతన అనుభవించారు. వారం గడుస్తున్నా యథాపూర్వ స్థితి ఇంకా ఏర్పడలేదు. కాకపోతే కాస్త మెరుగైంది.
ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికీ వాటా ఉంది. ఇండిగో ధిక్కరణను పసిగట్టలేని అమాయకత్వం క్షంతవ్యమేనా? తక్కువ చార్జీలతో ప్రయాణికులను ఆకట్టుకుని, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటూ, ఎవరికీ అందని స్థాయిలో విస్తరించుకుంటూ పోయిన ఇండిగో ఆ రంగంలో గుత్తాధిపత్యాన్ని నెలకొల్పింది. గత పాతికేళ్లలో మూతబడిన జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ సహారా, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్ వగైరా 9 సంస్థలు ఇండిగో చకచకా ఎదగటానికి దోహదపడ్డాయి. పర్యవసానంగా పౌర విమానయాన రంగంలో ఇండిగో 61 శాతం వాటాను సాధించగలిగింది. మరో సంస్థ ఎయిరిండియా 30 శాతం దగ్గర నిలిచింది.
పోటీదారులందరినీ దాటుకుని శరవేగంతో దూసుకుపోవటం, లాభార్జన అదే స్థాయిలో పెరగటం, స్వల్ప కాలంలోనే సమర్థవంతమైన సంస్థగా పేరు తెచ్చుకోవటం, ఏటా పది కోట్ల మంది ప్రయాణికులను చేరేయటం ప్రశంసించదగ్గ విజయమే కావొచ్చు. కానీ గగనతలంలో 35,000 అడుగుల ఎత్తున ఎగిరే విమానాలతోపాటే దాని అహంకారమూ పడగలెత్తింది. విమానయాన రంగాన్ని శాసిస్తున్న తనకు విధివిధానాలు నిర్దేశించటానికి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఎవరన్న స్థాయికి చేరుకుంది. అందుకే ఉద్దేశపూర్వకంగా ధిక్కారాన్ని ప్రదర్శించింది. ‘కేవలం అవగాహన లేమి వల్లా, ప్రణాళికల రూపకల్పనలో జరిగిన లోటుపాట్ల వల్లా’ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందన్న ఇండిగో ప్రకటన ఉత్త వంచన. ఎందుకంటే దేశీయ విమాన సర్వీసుల్ని ఎడా పెడా రద్దు చేసిన ఆ సంస్థ... అంతర్జాతీయ సర్వీసుల్లో కేవలం 10 శాతానికి మాత్రమే కోతపెట్టింది. ఆ సర్వీసులు ఇష్టానుసారం రద్దు చేస్తే భారీ మొత్తాల్లో జరిమానా
లుంటాయి మరి.
డీజీసీఏ ఏర్పరిచిన నిబంధనలు ఇప్పటివి కాదు. గత ఏడాది మొదట్లోనే... అంటే దాదాపు రెండేళ్లనాడే ఆ ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. లాభార్జన కోసం తక్కువ మందితో ఎక్కువ సర్వీసులు నడిపే ధోరణి ప్రమాదకరమన్న ఉద్దేశంతో విధించిన పరిమితులవి. వారంలో పైలెట్లకుండే విశ్రాంతి సమయాన్ని 36 గంటలనుంచి 48 గంటలకు పెంచటం, రాత్రి వేళల్లో పైలెట్లు పనిచేసే సమయాన్ని 10 గంటలకు పరిమితం చేయటం, ఒక పైలెట్ వారానికి రెండుసార్లకు మించి నైట్ ల్యాండింగ్‌లు చేయరాదన్న నిబంధన అందులో భాగమే. ఇవన్నీ గత నెల 1 నుంచి అమలు చేయాలని కోరింది.
ఈ ఏడాది కాలంలో ఇండిగో ఇందుకోసం సాగించిన కసరత్తేమీ లేదు. పైగా ఒకరి పైలెట్లను మరొకరు తీసుకోరాదని వేరే సంస్థలతో లాలూచీకి దిగి పనిగంటలు పెంచింది. సిబ్బంది వేతనాలను స్తంభింపజేసింది. ఇతర సంస్థలన్నీ దారిలోకి వచ్చినప్పుడు ఇండిగోకు మాత్రమే ఏమిటి సమస్య? గండం గట్టెక్కటానికి గత్యంతరం లేక డీజీసీఏ తన నిబంధనలు సడలించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఏర్పరిచిన నిబంధనలకే దిక్కులేకపోవటం విషాదం కాదా? బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగటం కాదా? ప్రతిదానికీ ప్రైవేటు మంత్రం జపించే పాలకులకు ఇండిగో వ్యవహారం కనువిప్పు కావాలి.
సంక్షోభ సమయాల్లో టిక్కెట్ ధరలు పెంచి ప్రయాణికుల జేబులు కొల్లగొడు తున్నా పట్టనట్టుండే ధోరణి ఇండిగో వంటి సంస్థలకు కొమ్ములూ కోరలూ తెచ్చింది. ధిక్కరణకు పురిగొల్పింది. ఉన్న రెండు ప్రధాన విమానయాన సంస్థల్ని సరిగా పర్యవేక్షించలేని కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు చేతగానితనం ఈ పర్యాటక సీజన్‌లో దేశం పరువు తీసింది. ఈ వ్యవహారంలో జవాబుదారీతనాన్ని నిగ్గు దేల్చి కేంద్రమంత్రితో సహా బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలి.


