సర్వీసుల సంఖ్య మెరుగైనా
మంగళవారం 422 ఇండిగో విమానాలు రద్దు
సాధారణ స్థితికి చేరుకున్నామన్న ఇండిగో
న్యూఢిల్లీ/ముంబై: గత రెండు రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వరుసగా ఎనిమిదో రోజు సైతం విమానాల రద్దు పర్వం కొనసాగింది. మంగళవారం మరో 422 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే 152 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 121, హైదరాబాద్‌లో 58, చెన్నైలో 50, ముంబైలో 41 విమానాలు రద్దయి హ్యాంగర్‌లకే పరిమితమయ్యాయి.
సంక్షుభిత ఇండిగో మాత్రం తమ సర్వీసులు దాదాపు మళ్లీ సాధారణస్థాయికి చేరుకుంటున్నాయని ప్రకటించింది. ఈ మేరకు ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ మంగళవారం ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ఇండిగో మళ్లీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. గతంలో విమానాల రద్దు ఘటన విషయంలో మరోసారి ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నా. మా వెబ్‌సైట్‌లో కనిపించే దాదాపు ప్రతి విమానం షెడ్యూల్ సమయానికి రాకపోకలు సాగించేలా శతథా కృషిచేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
ఇండిగో సర్వీసులపై కేంద్రం కోత
తరచూ విమానాలు రద్దవడంతో ఇండిగో టికెట్లు కొన్న ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఈ కంపెనీ టికెట్లు కొని అవస్థలు పడకుండా నివారించేందుకు దేశవ్యాప్త షెడ్యూల్‌లో సంస్థకు చెందిన 5 శాతం సర్వీసులపై మోదీ ప్రభుత్వం కోత విధించింది. ఆ మేరకు 5 శాతం షెడ్యూల్ స్లాట్‌ను ఇతర కంపెనీలకు కేటాయించింది. ముఖ్యంగా అత్యంత రద్దీ ఉండే, ప్రధాన రూట్లలో ఈ 5 శాతం షెడ్యూల్‌ను ఇతర కంపెనీలకు కేటాయించింది. దేశీయ పౌరవిమానయాన రంగంలో 65 శాతం వాటాను ఆక్రమించిన ఇండిగోపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర కంపెనీలకూ అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో వాటికి 5 శాతం స్లాబ్‌ను కేటాయించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అనుమతించిన షెడ్యూల్‌లో విమానాలను నడపలేక విఫలమైన ఇండిగోకు ప్రభుత్వం ఇలా స్లాట్ కోత రూపంలో పాక్షికంగా శిక్షించింది.


