ఇండిగోపై కేంద్రం తొలి వేటు! | DGCA cuts IndiGo flights by 5 Percent Amid Disruptions | Sakshi
Sakshi News home page

ఇండిగోపై కేంద్రం తొలి వేటు!

Dec 9 2025 11:50 AM | Updated on Dec 9 2025 12:00 PM

DGCA cuts IndiGo flights by 5 Percent Amid Disruptions

ఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం కొరడా ఝళిపించింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, వాయిదాలకు కారణమైనందుకు చర్యలు మొదలుపెట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇండిగో సంస్థకు ఉన్న స్లాట్లలో ఐదు శాతం కోత విధించింది. దీంతో ఇకపై ఈ వైమానిక సంస్థ నడిపే విమానాల సంఖ్యలో కనీసం 110 వరకూ తగ్గనున్నాయి. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు మరిన్ని విమాన సర్వీసుల రద్దుకు దారితీయడం గమనార్హం.

నిన్న మొన్నటి వరకు ఇండిగో దేశవ్యాప్తంగా దాదాపు 2200 సర్వీసులను నడిపేది. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో, తదితర సంస్థలు ఎన్నిసార్లు టేకాఫ్‌/ల్యాండింగ్‌లు జరిపేందుకు ఉన్న అనుమతుల సంఖ్యనే స్లాట్లు అంటాం. ఉదాహరణకు హైదరాబాద్‌ విమానాశ్రయంలో 24 గంటల సమయంలో ఇండిగోకు వంద స్లాట్లు ఉన్నాయనుకుంటే.. ఆ సంస్థ ఈ సమయంలో యాభై చోట్లకు సర్వీసులు నడపవచ్చు. డీజీసీఏ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఐదు శాతం స్లాట్లు తగ్గుతాయి కాబట్టి ఇకపై ఇండిగో హైదరాబాద్‌ నుంచి సుమారు 47 చోట్లకు మాత్రమే సర్వీసులను నడపగలదన్నమాట.

తగ్గించిన ఐదు శాతం స్లాట్లు ఏమవుతాయి?
డీజీసీఏ ఉత్తర్వుల ప్రకారం వీటిని ఇప్పుడు ఎయిర్‌ ఇండియా, ఆకాశ, స్పైస్‌జెట్‌ వంటి ఇతర సంస్థలకు కేటాయిస్తారు. స్లాట్ల తగ్గింపు నేపథ్యంలో ఇండిగో మంగళవారం చెన్నైలో అత్యధికంగా 41 విమానాలను రద్దు చేసింది. వీటిల్లో 23 ల్యాండింగ్స్‌ ఉన్నాయి. 18 టేకాఫ్‌లు ఉన్నాయి. తిరువనంతపురం, ఢిల్లీ, ముంబైలలోనూ ఒకటి అర సర్వీసుల రద్దు ఉన్నాయి. ‘‘స్లాట్ల తగ్గింపు చర్యల వల్ల వైమానిక సంస్థల బాధ్యత మరింత పెరుగుతుంది. షెడ్యూల్స్‌ నిర్వహణ మరింత మెరుగవుతుంది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యం తగ్గుతంది.’’ అని డీజీసీఏ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

ఇతర సంస్థలకు లాభం.. 
ఇండిగో స్లాట్లలో కోత ఇతర సంస్థలకు లాభదాయకంగా మరనుంది. చాలా బిజీగా ఉన్న ఎయిర్‌పోర్టుల్లోనూ తమ సర్వీసులను నడిపేందుకు అవకాశం కల్పిస్తుండటం ఇందుకు కారణం. అదే సమయంలో దేశీయంగా సుమారు 60 శాతం వాటా కలిగిన ఇండిగోకు స్లాట్ల కోతతో పడే ప్రభావం కూడా నామమాత్రమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాకపోతే ఇష్టారీతిన వ్యవహరిస్తే సహించబోమన్న సందేశం మాత్రం ఇండిగోకు అందుతుందని అంచనా. స్లాట్ల కోతపై ఇండిగో ఇప్పటివరకూ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కాకపోతే మరిన్ని క్రమశిక్షణ చర్యల నుంచి తప్పించుకునేందుకు దీన్ని ఒక అదనుగా తీసుకుంటుందని, షెడ్యూళ్ల సమీక్ష, గ్రౌండ్‌ సర్వీసులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్లాట్ల కోత కారణంగా కొన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉన్నందున ప్రయాణీకులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement