అబుదాబి విమానాశ్రయంపై ఇరాన్‌ దాడి | Telangana Man Injured In Abu Dhabi Airport Missile Attack Amid Israel Iran Tensions, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అబుదాబి విమానాశ్రయంపై ఇరాన్‌ దాడి

Mar 4 2026 10:57 AM | Updated on Mar 4 2026 11:09 AM

Telangana Man Injured In Abu Dhabi Airport Missile Attack Amid Israel Iran Tensions

పోతిరెడ్డిపల్లి వాసికి గాయాలు

భయాందోళనలో కుంటుంబ సభ్యులు

స్వగ్రామానికి రప్పించాలని వేడుకోలు 

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇజ్రాయెల్‌– ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఆదివారం అబుదాబి ఏయిర్‌పోర్ట్‌పై జరిగిన దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసికి గాయాలైన ఘటన మంగళవారం వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లికి చెందిన నందెల్లి రాజేశ్వర్‌రావు నాలుగేళ్లుగా బతుకు దెరువు కోసం అబుదాబిలోని ఏయిర్‌పోర్ట్‌లో క్లీనింగ్‌ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 

ఈ క్రమంలో ఆదివారం ఇరాన్‌ మిసైల్‌ దాడిలో ఏయిర్‌పోర్ట్‌ అద్దాలు పగిలి రాజేశ్వర్‌రావుకు గాజుపెంకులు చాతి, కుడి చేతి భాగాన కుచ్చుకుపోవడంతో హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స తర్వాత తన గదికి పంపించినట్లు తన సోదరుడు రామారావుకు మెస్సేజ్‌ పంపించారు. అలాగే ఏయిర్‌పోర్ట్‌ సమీపంలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం అందించినట్లు తెలిపారు.

 విమాన రాకపోకలు నిలిచిపోవడంతో స్వదేశానికి వచ్చే పరిస్థితులు లేవని, రెండుమూడు రోజుల్లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలిపినట్లు చెప్పారు. జరిగిన ఘటన తెలుసుకున్న రాజేశ్వర్‌రావు భార్య మీనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎలాగైనా స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని రాజేశ్వర్‌రావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాడుల నేపథ్యంలో అక్కడున్న తమ వారు ఎలా ఉంటారోనని ఆందోళన చెందుతున్నారు. రాజేశ్వర్‌రావుకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటీ పర్యంతమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement