రాజ్యసభ చర్చలో హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్య
న్యూఢిల్లీ: వందేమాతర గీతానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాంగ్రెస్ రక్తంలోనే ఉందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆనాడు జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని బుజ్జగింపు రాజకీయాల కోసం రెండుగా విడగొట్టడమే దేశ విభజనకు కారణమైందని, లేకుంటే దేశం ముక్కలై ఉండేది కాదని వ్యాఖ్యానించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభలో మంగళవారం చేపట్టిన చర్చను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ 1937లో జవహర్‌లాల్ నెహ్రూ ఈ గీతాన్ని రెండు ముక్కలుగా చేసి, కేవలం రెండు చరణాలకే పరిమితం చేశారన్నారు.
బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఆయన అలా చేసినట్లు చాలా మంది భావించారని, వందేమాతరంను రెండుగా విభజించకుంటే దేశం ముక్కలయ్యేది కాదని కూడా అనుకున్నారని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్ అలాంటి రాజకీయాలు చేస్తోందన్నారు. వందేమాతర గీతం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించిందన్నారు. జాతీయ గీతాన్ని త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలతో ప్రతిపక్షం ముడిపెట్టడాన్ని ఆయన నిరసించారు. దేశ సాంస్కృతిక జాతీయవాదాన్ని మేలుకొల్పిన మంత్రం వందేమాతరమని ఆయన చెప్పారు.
స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆ గీతం ఎలాంటి ప్రముఖ పాత్ర పోషించిందో నేటికీ ఆ గీతానికి అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. భవిష్యత్ వికసిత్ భారత్‌కు కూడా వందేమాతరం ఎంతో అవసరమైందని చెప్పారు. ఇతర అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే వందేమాతరంపై ప్రభుత్వం చర్చకు పెట్టిందని చాలా మంది కాంగ్రెస్ సభ్యులు అనుకుంటున్నారన్న ఆయన.. కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం ఎన్నడూ భయపడలేదన్నారు. పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయకుండా, సరిగ్గా కార్యకలాపాలు జరగనిస్తే అన్ని అంశాలపైనా చర్చకు అవకాశమేర్పడుతుందని అమిత్ షా తెలిపారు.


