ఇటు ప్రయాణికులకు, అటు డ్రైవర్లకు భారీ లబ్ధి ఖాయమన్న కేంద్రం
లోక్‌సభలో ప్రకటించిన అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల రైడ్–ఆధారిత మొబైల్ యాప్‌ల అధిక చార్జీల భారం నుంచి ఉపశమనం కల్పించే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ యాప్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రైవేట్ కంపెనీల అధిక చార్జీల మోత నుంచి ఇటు ప్రయాణికులకు విముక్తి కల్పిస్తూనే డ్రైవర్లకు సైతం అధిక లాభాలు ఒనగూరేలా యాప్‌ను డిజైన్‌చేస్తున్నట్లు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయం వెల్లడించారు. ‘‘ సహకారసంస్థల దన్నుతో బైకులు, ఆటోలు, కార్లలో వినియోగించేలా రైడ్–ఆధారిత మొబిలిటీ యాప్‌ను తీసుకురావాలని ప్రతిపాదించాం.
ప్రయాణికులు ఎంతో సులభంగా రైడ్ బుక్ చేసుకునేలా యాప్ డిజైన్ ఉంటుంది. చార్జీల్లో పారదర్శకత, వాహన ట్రాకింగ్, సందేహాలు నివృత్తిచేసేందుకు పలు భాషల్లో 24 గంటలూ సేవలందించే కస్టమర్‌కేర్ సౌకర్యం, భద్రత, సురక్షణల వంటి ఎన్నో ఫీచర్లతో యాప్‌ను సిద్ధంచేస్తాం. ఈ యాప్‌లో సంస్థ కమిషన్ అనేది సున్నా. అందుకే డ్రైవర్లకు ఎలాంటి కమిషన్ కోతలు లేకుండా నేరుగా భారీ ప్రయోజనం చేకూరుతుంది. కోఆపరేటివ్ సొసైటీకొచ్చే ఆదాయం నేరుగా డ్రైవర్లకే చేరుతుంది. తక్కువ చార్జీల కారణంగా ప్రయాణికులకు సైతం సొమ్ము ఆదా అవుతుంది.
అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు లబ్ధిచేకూరేలా ధరల శ్రేణి ఉంటుంది’’ అని అమిత్ షా అన్నారు. ‘భారత్ ట్యాక్సీ’ డిజిటల్ యాప్‌ను సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ దన్నుతో పలు కేంద్ర, రాష్ట్ర, డ్రైవర్ల సహకార సంఘాలు ఇందులో వాటాదారులుగా ఉన్నాయి. రాష్ట్రాల సహకార సొసైటీల చట్టం–2002 కింద ఈయాప్‌ను 2025 జూన్ ఆరోతేదీన నమోదుచేశారు. డ్రైవర్లు సైతం ఈ సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్‌లో భాగస్వాములుగా ఉండటం విశేషం. ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.


