పార్లమెంట్‌లో తెలంగాణ | Centre Releases Rs 599. 31 Cr for Telangana under PM-Kisan Scheme in November 2025 | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో తెలంగాణ

Dec 3 2025 5:09 AM | Updated on Dec 3 2025 5:09 AM

Centre Releases Rs 599. 31 Cr for Telangana under PM-Kisan Scheme in November 2025

పీఎం–కిసాన్‌ కింద తెలంగాణ రైతులకు చెల్లించిన మొత్తం రూ.14,236 కోట్లు

తెలంగాణలో పనిచేస్తున్నసహకార సంఘాలు  48,186

వరంగల్‌లో సేకరించిన ధాన్యం 15.56 లక్షల మెట్రిక్‌ టన్నులు

తెలంగాణలో చేపల ఉత్పత్తి 4.77 లక్షల టన్నులు

తెలంగాణ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్లు 511

పీఎం–కిసాన్‌ కింద తెలంగాణ రైతులకు రూ.14,236 కోట్ల చెల్లింపు  

సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’(పీఎం–కిసాన్‌) పథ కం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలోని రైతులకు మొ త్తం రూ.14,236.18 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ధర్మపురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత నవంబర్‌ 19న విడుదల చేసిన 21వ విడతలో తెలంగాణలోని 29.96 లక్షల మంది రైతులకు రూ.599. 31 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తెలిపారు.

ఐదేళ్లలో రూ.6.21 లక్షల కోట్ల యూరియా సబ్సిడీ 
దేశ వ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో (2020–21 నుంచి 2024–25 వరకు) యూరియా సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.6,21,944.29 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. రాజ్యసభలో తెలంగాణ ఎంపీ కేఆర్‌.సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సబ్సిడీ భారం2022–23 నాటికి గరిష్టంగా రూ.1,68,676 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఇది రూ.1,24,319 కోట్లుగా ఉంది.  

వరంగల్‌లో 15.56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ 
వరంగల్‌ జిల్లాలో 2024–25 పంట కాలానికి సంబంధించి రైతుల నుంచి 15.56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 2.95 లక్షల బేళ్ల పత్తిని సేకరించినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

సీఎస్‌ఆర్‌ వ్యయం రూ. 34,908 కోట్లు 
దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కంపెనీలు వెచి్చస్తున్న నిధులు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 34,908.75 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో తెలంగాణ ఎంపీ బి.పార్థసారథి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

తెలంగాణలో 48,186 సహకార సంఘాలు పనిచేస్తున్నాయి 
తెలంగాణలో 48,186 సహకార సంఘాలు క్రియాశీలంగా పనిచేస్తుండగా, వాటిలో దాదాపు కోటి మందికి (1,00,60,281) పైగా సభ్యులు ఉన్నారని కేంద్ర మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. లోక్‌సభలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో (అక్టోబర్‌ 31 వరకు) మార్కెటింగ్, డెయిరీ, ఇతర రంగాలకు కలిపి మొత్తం రూ. 20,989.33 కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం గణాంకాలను బయటపెట్టింది. 2024–25లో తెలంగాణకు చెందిన 5,639 మందికి శిక్షణ ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు.  

తెలంగాణలో 4.77 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి 
హైదరాబాద్‌లో రూ. 47 కోట్లతో భారీ హోల్‌సేల్‌ ఫిష్‌ మార్కెట్‌ 
తెలంగాణలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4.77 లక్షల టన్నుల ఇన్‌లాండ్‌ చేపల ఉత్పత్తి జరిగిందని కేంద్ర మంత్రి రాజీవ్‌రంజన్‌ సింగ్‌ వెల్లడించారు. లోక్‌సభలో జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌కుమార్‌ షెటా్కర్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ’ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’కింద 2020–21 నుంచి 2024–25 వరకు తెలంగాణకు రూ. 339.37 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, ఇందులో కేంద్ర వాటా రూ.108.73 కోట్లు కాగా, రూ.39.40 కోట్లు విడుదల చేశామన్నారు. మత్స్య రంగాన్ని బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లో రూ. 47.03 కోట్లతో అత్యాధునిక హోల్‌సేల్‌ ఫిష్‌ మార్కెట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు మంత్రి పేర్కొన్నారు.  

తెలంగాణ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 511 పీజీ సీట్లు 
తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను బలోపేతం చేయడంలో భాగంగా మొత్తం 511 పీజీ వైద్య సీట్లను ఆమోదించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ (హైదరాబాద్‌)లో అత్యధికంగా 145 సీట్లు (మొదటి విడతలో 113, రెండో విడతలో 32), కాకతీయ మెడికల్‌ కాలేజీ (వరంగల్‌): 92 సీట్లు (89+3), గాంధీ మెడికల్‌ కాలేజీ (సికింద్రాబాద్‌): 91 సీట్లు (77+14), సిద్దిపేట మెడికల్‌ కాలేజీ: 80 సీట్లు, నల్లగొండ (30), సూర్యాపేట (25), ఆదిలాబాద్‌ రిమ్స్‌ (22), నిజామాబాద్‌ (16), మహబూబ్‌నగర్‌ (10) కాలేజీల్లో కూడా సీట్లు పెరిగాయి.  

నకిలీ మందులపై ఉక్కుపాదం.. 700 కంపెనీల ఆడిట్‌ 
దేశంలో నకిలీ, నాసిరకం మందుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర  మంత్రి అనుప్రియా పటేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో దగ్గు మందు (కోల్డ్‌ రిఫ్‌ సిరప్‌) తాగి చిన్నారులు మరణించిన ఘటనపై విచారణ జరిపామని, ఆ మందులో ప్రమాదకరమైన ’డైథలిన్‌ గ్లైకాల్‌’46.28 శాతం ఉన్నట్టు తేలిందని మంత్రి వెల్లడించారు. ఈ మందును తయారు చేసిన తమిళనాడుకు చెందిన కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.  దేశవ్యాప్తంగా 700కు పైగా దగ్గు మందు తయారీ కంపెనీల్లో ముమ్మర తనిఖీలు (ఆడిట్‌) నిర్వహించినట్టు కేంద్రం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement