మొదటి విడత అభ్యర్థుల జాబితాపై నేడు స్పష్టత
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 36,452 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరుగుతాయి. శుక్రవారం వరకు నామినేషన్ల స్వీకరణ ఉంంటుంది. 6వ తేదీన నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. ఈ నామినేషన్ల తిరస్కరణపై 7న వినతులు స్వీకరించి, 8న వాటిని పరిష్కరిస్తారు. 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
ఈ నెల 11వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధతపై వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. మంగళవారం ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముగిసిన రెండో విడత నామినేషన్లు
రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు మంగళవారంతో ముగిసింది. రాత్రి వరకు కూడా పలు జిల్లాల్లోని పంచాయతీల్లో నామినేషన్ల సమర్పణ కొనసాగినట్టుగా ఎస్‌ఈసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మూడు రోజులకు సంబంధించిన నామినేషన్ల వివరాలను బుధవారమే వెల్లడించే అవకాశాలున్నాయి. రెండో విడతలో నోటిఫై చేసిన 4,332 సర్పంచ్ పదవులకు రెండు రోజులు కలిపి మొత్తం 12,479 మంది నామినేషన్లు వేశారు. వార్డు సభ్యుల విషయానికొస్తే 38,350 వార్డులకు 30,040 నామినేషన్లు పడ్డాయి.
జిల్లాల వారీగా చూస్తే.. సర్పంచ్ నామినేషన్లలో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 883 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే.. రంగారెడ్డి జిల్లాలో ఆశావహులు క్యూ కట్టారు. ఇక్కడ అత్యధికంగా 2,070 నామినేషన్లు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో నామినేషన్లు తక్కువగానే పడ్డాయి.


