మరో రెండు భారీ రోడ్ నెట్‌వర్క్ ప్రాజెక్టులకు ప్రణాళిక
తెలంగాణ మణిహారం, ప్రజావలయం పేర్లతో రూపకల్పన
విజన్ డాక్యుమెంట్‌లో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగురోడ్డు.. హైదరాబాద్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిన రోడ్ నెట్‌వర్క్. ఇప్పుడు దానిని తలదన్నేలా రీజినల్ రింగు రోడ్డు ప్రాణం పోసుకుంటోంది. ఇది తెలంగాణ పురోగతికి గేమ్ చేంజర్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, ప్రభుత్వం ఈ రెండు రింగు రోడ్లకే పరిమితం కాలేదు.
రాష్ట్ర వ్యాప్త ప్రాంతాలు అనుసంధానమయ్యే మరో రెండు బృహత్తర రింగు రోడ్లకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’డాక్యుమెంట్‌లో ఈ రెండు మెగా రోడ్ ప్రాజెక్టులను చేర్చింది. 2047 లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని ప్రభుత్వం పేర్కొంటోంది.
తెలంగాణ మణిహారం
ఇది దాదాపు రాష్ట్ర సరిహద్దులకు చేరువగా రూపొందే ఓ రింగురోడ్డు. దీని నిడివి దాదాపు 1,150 కి.మీ.లు. ఇది రాష్ట్రాన్ని చుట్టేస్తూ నగరాలు, జిల్లా కేంద్రాలు, పెరి–అర్బన్ ప్రాంతాలను అనుసంధానం చేసే మెగా రోడ్ నెట్‌వర్క్. ఇది దాదాపు అన్ని ప్రధాన జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లతో అనుసంధానమవుతుంది.
ఏ రోడ్డు నుంచి ఏ రోడ్డు మీదకైనా వెళ్లేలా ఇది అనుసంధానిస్తుంది. దీన్ని ఆసరా చేసుకొని ఆయా ప్రాంతాలు పురోగమించేందుకు వీలుగా పరిశ్రమల ఏర్పాటుతోపాటు పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. బలమైన రోడ్డు నెట్‌వర్క్‌తో పెట్టుబడులు భారీగా వస్తాయన్నది ప్రభుత్వ అభిప్రాయం.
ప్రజావలయం
ఇది దాదాపు 770 కి.మీ. నిడివితో ఉంటుంది. గ్రామీణ తెలంగాణ పురోగతికి ఊతమిచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందిన 770 కిలోమీటర్ల ‘ప్రజావలయం’. రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల మధ్య సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని కల్పిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు త్వరగా చేరేలా చేయటంతోపాటు గ్రామీణ యువతకు ఉపాధి, విద్య, ఆరోగ్య సేవలకు సులువైన రవాణా వ్యవస్థ కల్పించేందుకు దోహదం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంటోంది. సరైన రోడ్ నెట్‌వర్క్ లేక కునారిల్లుతున్న పల్లెలకు ఇది జీవం పోస్తుందన్న భావనను వ్యక్తం చేస్తోంది.
ఈ రెండింటికి రూ.36 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా మొత్తం 1,920 కి.మీ. కొత్త రోడ్ల నెట్‌వర్క్ నిర్మాణానికి రూ.36 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్నది ప్రాథమిక అంచనా. ‘తెలంగాణ మణిహారం రాష్ట్రాన్ని మాలగా అలంకరించనుండగా, ప్రజావలయం ప్రతి పల్లెకు రక్తనాళంగా జవసత్వాలు కల్పిస్తుంది. 2047 నాటికి ప్రతి వ్యక్తి పురోగమించేందుకు ఈ రెండు రోడ్లు పునాది వేస్తాయి’ఇది ప్రభుత్వ మాట.
ప్రస్తుతానికి విజన్ డాక్యుమెంట్.. కాగితాలకు పరిమితమైన ఆలోచన. అయితే ఇది కార్యరూపం దాల్చటంలో ఎన్నో సవాళ్లున్నాయి. ఔటర్ రింగురోడ్డుకు 50 కి.మీ. దూరంలో నిర్మించతలపెట్టిన రీజినల్ రింగురోడ్డు పదేళ్లుగా ప్రణాళికలకే పరిమితమైంది. అందులో సగ భాగం అయిన ఉత్తర రింగు వరకు భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నా, ఇంకా అవాంతరాలు వీడలేదు. దక్షిణ రింగు ఇంకా పురుడే పోసుకోలేదు. కనీసం అలైన్‌మెంట్ కూడా సిద్ధం కాలేదు. ఇలాంటి తరుణంలోఇంత భారీ బృహత్ రహదారి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


