దేశ తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ,రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీకి శ్రీకారం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ నిర్వహణపైనా మరో ప్రకటన
వివిధ రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం.. అతిథులకు ప్రత్యేక సావనీర్ కిట్లతో స్వాగతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనుంది. దేశ తొలి మహిళల ఫిఫా–ఏఐఎఫ్‌ఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీతోపాటు పురుషుల రెండో ఫిఫా–ఏఐఎఫ్‌ఎస్ ఫుట్‌బాల్ అకాడమీని రాష్ట్రంలో ఏర్పాటు చేసే అంశంపై ప్రకటన చేయనుంది.
ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా), ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) భాగస్వామ్యంతో ఈ రెండు అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ అకాడమీల ఏర్పాటుపై ప్రకటన వెలువడనుంది. ఫిఫా మహిళల ఫుట్‌బాల్ తొలి అకాడమీ హాంగ్‌కాంగ్‌లో ఏర్పాటవగా రెండోది తెలంగాణలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్ నిర్వహణపైనా సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
అతిథులకు ప్రత్యేక బాస్కెట్లు
ప్రపంచం నలుమూలల నుంచి సమ్మిట్‌కు హాజరుకానున్న అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బాస్కెట్‌లను అందించి స్వాగతం పలకనుంది. కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికీ గుర్తిండిపోయేలా సంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రతి బాస్కెట్‌లో పోచంపల్లి ఇక్కత్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లు, పోచంపల్లి శాలువా, చేర్యాల మాస్క్ (పెయింటిగ్స్), హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో చేసిన ఆభరణాలు ఉండనున్నాయి. అలాగే మహువా లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదామ్ కీ జాలి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించనుంది.
రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించే బాధ్యతను మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. జమ్మూకశ్మీర్, గుజరాత్ సీఎంలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించనుండగా మంత్రి దామోదర రాజనర్సింహకు పంజాబ్, హరియాణా సీఎంలను ఆహ్వానించనున్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏపీ, మంత్రి శ్రీధర్‌బాబు కర్ణాటక, తమిళనాడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి యూపీ సీఎంను ఆహ్వానం పలకనున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాజస్తాన్, మంత్రి కొండా సురేఖకు ఛత్తీస్‌గఢ్, మంత్రి సీతక్కకు పశ్చిమ బెంగాల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్యప్రదేశ్, మంత్రి జూపల్లి కృష్ణారావుకు అస్సాం, మంత్రి వివేక్ వెంకటస్వామికి బిహార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు హిమాచల్ ప్రదేశ్, మంత్రి వాకిటి శ్రీహరికి ఒడిశా, మంత్రి అజహరుద్దీన్‌కు మహారాష్ట్ర సీఎంలను ఆహ్వానించే బాధ్యతను సీఎం రేవంత్ అప్పగించారు. సీఎంలతోపాటు ఆయా రాష్ట్రాల ఎంపీలను సైతం ఆహ్వానించాలని కోరారు.


