కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..
శివకుమార్ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజరు
సాక్షి బెంగళూరు: ‘‘డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు..! అది... హైకమాండ్ నిర్ణయించినప్పుడు’’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. అధికార మార్పిడి విషయంలో అధిష్ఠానం ఏం తీర్మానిస్తే ఆ ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌ను కలుస్తానని... అయితే, ఇప్పటివరకు ఆహ్వానం అందలేదని తెలిపారు.
అధికార మార్పిడి విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి తాను, డీకే కట్టుబడతామని వెల్లడించారు. మంగళవారం సీఎం సిద్ధరామయ్య బెంగళూరు సదాశివనగరలోని డీకే ఇంటికి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు వెళ్లారు. ఇద్దరు నేతలు రెండు గంటలకు పైగా పలు అంశాలను చర్చించారు.
కాగా, నాయకత్వ మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అల్ఫాహార భేటీ అనంతరం ఇద్దరు నేతలు మరోసారి స్పష్టం చేశారు. సిద్ధు ఆహ్వానంతో గత నెల 29న ఆయన ఇంటికి డీకే బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు డీకే కోరిక మేరకు మంగళవారం సిద్ధు ఆయన ఇంటికి వచ్చారు. రెండు సమావేశాల తర్వాత తామిద్దరం ఒక్కటేనన్న సందేశాన్ని ఇచ్చారు.
మైసూరు మెనూతో...
అల్పాహార విందులో తనకు పల్లె నుంచి నాటుకోడి తెప్పించాలని డీకేను కోరినట్లు సిద్ధు చమత్కరించారు. ఈ మేరకు మైసూరు శైలిలో నాటు కోడి పులుసు, ఇడ్లీ, సాంబార్‌ను డీకే సిద్ధం చేశారు. భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్ పాల్గొన్నారు. విందు అనంతరం సిద్ధు మీడియాతో మాట్లాడుతూ తామెప్పుడూ ఒకటిగానే ఉన్నామని, ఎమ్మెల్యేలూ కలసికట్టుగా ఉన్నారని, ఒకే సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. 2028లో ఉమ్మడిగా పనిచేసి.. తాను, డీకే మళ్లీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
డీకేతో రాజకీయ, పార్టీ అంశాలు, 8 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడామన్నారు. 8న ఢిల్లీ వెళ్లి ఎంపీలతో మాట్లాడతామని, సమయం ఇస్తే హైకమాండ్‌ను కలుస్తానని సీఎం చెప్పారు. డీకే మాట్లాడుతూ... ఎమ్మెల్సీల ఎంపిక సహా సీఎం సిద్ధుతో రాజకీయ విషయాలను చర్చించానన్నారు. తమది ఒకటే గొంతుక అని, ఒకటే ఆచార వ్యవహారమని, ప్రతిపక్షాలను ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు.
సాదర ఆహ్వానం..
సీఎం సిద్ధును డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. సిద్ధుకు డీకే సురేశ్ పాదాభివందనం చేశారు. ఇద్దరు అన్నదమ్ములను సీఎం ఆత్మీయంగా పలకరించారు. సిద్ధు, డీకే ఇద్దరూ కార్టియర్ కంపెనీ వాచీలతో కనిపించారు. ఈ రెండూ ఒకేలా ఉన్నాయి. వీటి విలువ రూ.43 లక్షలని తెలిసింది. కాగా, సీఎం వాచీ విషయమై రాష్ట్ర బీజేపీ విమర్శలు గుప్పించింది. సర్వసాధారణమైన సమాజవాదినని చెప్పుకొనే సీఎం సిద్ధుకు ఇంత ఖరీదైన వాచీ ఎందుకని ప్రశ్నించింది.


