బెంగళూరు: కర్ణాటక రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను (Siddaramaiah) మంగళవారం బ్రేక్ ఫాస్టుకు ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) వెల్లడించారు. దీంతో, వారిద్దరూ కలవడంపై కొత్త చర్చ మొదలైంది.
ఈ విషయాన్ని డీకే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్..‘కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి, ముఖ్యమంత్రిని రేపు బ్రేక్‌ఫాస్ట్‌కి ఆహ్వానించాను’ అని రాసుకొచ్చారు. అయితే, గత శనివారమే వీరిద్దరూ సిద్ధరామయ్య ఇంట్లో సమావేశం అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ప్రకటించారు. అధిష్ఠానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని తెలిపారు.
ఇక, అంతకుముందు.. అధిష్ఠానం సూచనల మేరకు సిద్ధరామయ్య మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రిని బ్రేక్‌ఫాస్ట్ చర్చకు ఆహ్వానించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి వర్గం కోరుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్, ప్రభుత్వంలో రెండు వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తాజా స్పందించారు.
సిద్ధరామయ్య, తాను సోదరుల్లా కలిసి ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వంలో సిద్ధరామయ్య గ్రూప్ లేదా డీకే శివకుమార్ గ్రూప్ అంటూ ఏమీ లేవని స్పష్టం చేశారు. మీడియా మాత్రం కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గ్రూప్‌లు ఉన్నట్లు ప్రచారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఒత్తిడి వల్లే తాము ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ చర్చలు జరిపామని తెలిపారు.


