చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్న నేపథ్యంలో సినీనటుడు విజయ్‌కు చెందిన టీవీకే ఇప్పటికీ పొత్తులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కూటమి తమిళనాడులో గెలిస్తే విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, పొత్తుల గురించి వస్తున్న ఇలాంటి ప్రచారానికి చెక్ పెట్టేందుకు టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. కూటమి గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదని, అలాగే వదంతులను నమ్మవద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
‘ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్‌తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యం.
కొన్ని నిర్దిష్ట పార్టీలతో, రాజకీయ నాయకులతో ఏ స్థాయిలోనూ చర్చలు జరగలేదని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. గతంలో కూడా కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలతో కలుస్తున్నామంటూ ఇలాంటి తప్పుడు వార్తలు రావడం అందరికీ తెలిసినదే, అది నిజం కాదు.
అయితే ప్రజలు, టీవీకే కార్యకర్తల్లో గందరగోళం కొనసాగించేందుకు డీఎంకే ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేస్తోంది. బాధ్యతాయుత మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వినియోగదారులు నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఇలాంటి వదంతులు ప్రచారం చేయొద్దు. నిజమే గెలుస్తుంది!’ అని చెప్పారు.


