భారతదేశంలోని అత్యంత విశిష్ట గైనకాలజిస్టులలో ఒకరైన డాక్టర్ కె లక్ష్మీ బాయి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన జీవితకాల పొదుపు నుంచి రూ. 3.4 కోట్లను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భువనేశ్వర్‌కు విరాళంగా ఇచ్చారు. మహిళలకు క్యాన్సర్ సంరక్షణ సేవలకు గాను ఈ విరాళాన్ని అందించారు. డిసెంబర్ 5న ఆమె 100వ పుట్టినరోజు జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె దానం చేయడం విశేషం.
100వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న డాక్టర్ కె లక్ష్మీ బాయి తన జీవితాంతం పొదుపు చేసుకున్న రూ. 3.4 కోట్లను ఒడిశా, క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళల కోసం గైనకాలజికల్ ఆంకాలజీ యూనిట్‌ను నిర్మించడానికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ, ఇది గైనకాలజికల్ ఆంకాలజీ కార్యక్రమాన్ని స్థాపించడంలో సహాయ పడుతుందని, భవిష్యత్ వైద్యులను రూపొందిస్తుందని, ఎంతోమంది మహిళల ఆశలను రెక్కలివ్వాలనేది తన కోరిక అని చెప్పారు. దీంతో పాటు యువతులలో క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడే కౌమార టీకా డ్రైవ్‌లకు మద్దతుగా డాక్టర్ బాయి బెర్హంపూర్ ప్రసూతి మరియు గైనకాలజీ సొసైటీకి రూ. 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. భావ్‌నగర్‌లోని డాక్టర్ బాయి నివాసంలో ఆమె పూర్వ విద్యార్థులు కొందరు నిర్వహించే సన్మాన కార్యక్రమానికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు హాజరవుతారని భావిస్తున్నారు.
యాభై సంవత్సరాలకు పైగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ లక్ష్మీ బాయి తన క్లినికల్ ప్రావీణ్యం కోసం మాత్రమే కాకుండా, మహిళలకు గౌరవప్రదమైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడంలో ఆమె అచంచలమైన నిబద్ధతకు కూడా విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
1926లో డిసెంబర్ 5, జన్మించిన డాక్టర్ లక్ష్మీ బాయి, కటక్‌లోని SCB మెడికల్ కాలేజీలో మొదటి MBBS బ్యాచ్‌లో ఉన్నారు. అక్కడినుంచే ఆమె అద్భుతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి DGO, MD (ప్రసూతి & గైనకాలజీ) పట్టాలు పుచ్చుకున్నారు. USAలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్‌లో MPHని అభ్యసించారు. 1950లో సుందర్‌గఢ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృత్తిని ప్రారంభించారు. 1986లో బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీలో O&G ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు.


