
అనంతపురం మెడికల్: బిడ్డ ఆకలి తీర్చే ప్రతి మహిళా అమ్మే. కళ్లు కూడా తెరవని పసి కూనలు ఆకలితో అమ్మ స్తనమందుకున్నా పాలు రాకపోతే.. ఆ బిడ్డల పరిస్థితి ఊహించలేం. ఆ తల్లిపడే వేదన వర్ణించలేం. ఇలా ఎందరో మహిళలు ప్రసవం అయ్యాక సకాలంలో పాలుపడక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ‘దర్శి లిఖిత’ అమ్మలా మారారు. పాలుపడక ఎటూపాలుపోని స్థితిలో ఉన్న తల్లులకు అండగా నిలిచారు. వేలాది మంది బిడ్డలకు పాలిచ్చి ప్రాణాలు పోశారు.
ఇప్పటివరకు 45 లీటర్ల పాలదానం
అనంతపురానికి చెందిన దర్శి లిఖిత బెంగళూరులోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఇండియా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఓ బిడ్డకు జన్మనిచ్చారు. సకాలంలో పాలు పడక బిడ్డకు డబ్బాపాలు పట్టారు. ఆ సమయంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అనంతరం ఆ సమస్యను అధిగమించారు.
పొత్తిళ్లలోని బిడ్డకు పాలివ్వలేని స్థితిలో తనలా ఎందరో తల్లులు బాధపడుతున్నారని తెలిసి చలించిపోయారు. ఈ క్రమంలోనే తనవంతుగా తల్లిపాలను దానం చేయాలని భావించారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో ‘మదర్ మిల్క్ బ్యాంకు’కు ఇప్పటికే 31 లీటర్ల పాలను ఇచ్చారు. తాజాగా మంగళవారం మరో 14 లీటర్ల పాలను సర్వజనాస్పత్రిలోని మదర్ మిల్క్ బ్యాంకుకు అప్పగించారు. ఇప్పటి వరకు ఆమె 45 లీటర్ల తల్లిపాలను మిల్క్ బ్యాంకుకు అందించడం విశేషం.
దీంతో మంగళవారం ఆస్పత్రిలో దర్శి లిఖితను డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్కడ పాల కోసం వేచి ఉన్న తల్లులు దర్శి లిఖితకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డిప్యూటీ ఆర్‌ఎంఓ హేమలత మాట్లాడుతూ... దర్శి లిఖిత ఔదార్యం ఎంతో మందికి ఆదర్శమన్నారు. తనకు తెలిసి రాష్ట్రంలోనే ఎక్కడా ఇలా ఈ స్థాయిలో తల్లిపాలను ఇచ్చి ఉండరని తెలిపారు. పాలు పట్టక ఇబ్బంది పడుతున్న తల్లుల కంటతడి తుడిచేందుకు మదర్‌మిల్క్ బ్యాంక్ ద్వారా పాలను అందించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యూట్రీషియనిస్టు పల్లవి, కౌన్సిలర్ రాధ, స్టాఫ్‌నర్సు రమ పాల్గొన్నారు.