కలెక్టర్లు, అధికారులపై సీఎం చంద్రబాబు కస్సుబుస్సు
కేంద్ర పథకాల నిధులు వ్యయం చేయట్లేదు
ఆఖరికి డేటా కూడా అప్‌డేట్ చేయడం లేదు
గతేడాది కంటే వృద్ధి తగ్గే పరిస్థితి
మనకంటే ఇతర రాష్ట్రాలు మంచి వృద్ధి సాధించాయి
అవసరమైతే కొందరికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెడతా
కేంద్ర నిధులు మురిగిపోతే మంత్రులు, కార్యదర్శులదే బాధ్యత
ప్రజల్లో సంతృప్తి పెరిగేలా వారి వద్దకు వెళ్లండి
పీపీపీలో 290 ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో
ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉందన్న బాబు..
చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్న సాగునీటి నిపుణులు, రైతులు
ఏపీ హక్కులను బాబు తాకట్టు పెట్టి అన్యాయంగా మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం
సాక్షి, అమరావతి: లక్ష్యం మేరకు ఆదాయం రావడం లేదని, కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులను వ్యయం చేసి తిరిగి తెచ్చుకోవడంలో అధికారులు, కలెక్టర్లు వైఫల్యం చెందారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయ ఆర్జన శాఖలు పనితీరు కనపర్చాలని, సాకులు చెబితే కుదరదని స్పష్టం చేశారు. జీఎస్‌డీపీ పెరిగితే ఆ మేరకు ఆదాయ వనరులు కూడా పెరగాలని, లేదంటే ఎక్కడో తేడా వస్తోందన్నారు. జీఎస్డీపీని కేంద్ర ఏజెన్సీ కూడా పరిశీలిస్తుందని, మనం రాసుకుంటే సరిపోదని వ్యాఖ్యానించారు.
సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతోపాటు వర్చువల్‌గా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పలు అంశాలను సమీక్షించారు. గతేడాది 12.05 శాతం వృద్ధి సాధిస్తే, ఈ ఏడాది అంచనాల మేరకు 11.5 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే వీలుందన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది తగ్గిపోతున్నామని పెదవి విరిచారు. నిజానికి ఈ ఏడాది వృద్ధి లక్ష్యం 16 శాతంగా నిర్దేశించుకున్నట్లు గుర్తు చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, విభాధిపతులు పది సూత్రాలను సాధించేందుకు రోజువారీ, నెలవారీ క్యాలెండర్‌తో ప్రణాళికలు తయారు చేసుకుని పనితీరు కనపరచాలని, ఉపన్యాసాలు చెబితే కుదరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుంటాయని, దానికి ముందు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామని సీఎం చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో మంచి వృద్ధి..!
గతేడాది మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాలు మంచి వృద్ధి సాధించాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర నిధులను వ్యయం చేయకపోవడంపై మంత్రులు, అధికారులు, కలెక్టర్లపై సీఎం విరుచుకుపడ్డారు. కొంత మంది కలెక్టర్లు డేటా కూడా అప్‌డేట్ చేయడం లేదని, అలాంటి వారిని ఎక్స్‌పోజ్ చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే కొంతమందికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెడతానన్నారు. కలెక్టర్లు, అధికారులు పనితీరు కనపరచాలన్నారు. కేంద్ర పథకాల నిధుల్లో ఒక రూపాయి కూడా మురిగిపోకూడదని, ఆ పరిస్థితి వస్తే మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇవ్వాల్సి వస్తుందని సీఎం స్పష్టం చేశారు.
చాలా శాఖలు 50 శాతం నిధులను కూడా వ్యయం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలన్నరలో నిధులన్నీ వ్యయం చేసి మార్చి 15వ తేదీన కేంద్రం నుంచి అదనపు నిధులు తేవాలని సూచించారు. పెన్షన్ మినహా మిగతా పథకాలపై ప్రజల్లో సంతృప్తి తక్కువగా ఉందని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, విభాగాధిపతులు డేటా తీసుకుని క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలపై 80 శాతం సంతృప్త స్థాయి తేవాలని నిర్దేశించారు. ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగకుంటే మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల వైఫల్యంగానే పరిగణిస్తామన్నారు. విభాగాధిపతులు మౌనంగా కూర్చుంటే కుదరదని, పనితీరు చూపించాక మాట్లాడాలన్నారు.
పీపీపీలో 290 ప్రాజెక్టులు..
నిధులు లేవని ప్రాజెక్టులు నిలిపి వేయకుండా పీపీపీ, హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. పీపీపీ ప్రాజెక్టుల కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో రోడ్లు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. ఎస్‌ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ విధానంలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన 290 ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్న ట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్ర తెలిపారు.
తెలంగాణ ప్రాజెక్టులు కడితే నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు...
తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడూ అడ్డు చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. పుష్కరాల్లోగా పోలవరం నిర్మించి జాతికి అంకితం చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు.
కాగా తెలంగాణ సర్కారు కృష్ణా నదిపై అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా చంద్రబాబు ఏపీ హక్కులను తాకట్టు పెట్టారని సాగునీటి నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. జన్మభూమికి ద్రోహం తలపెట్టి రాయలసీమ ఎత్తిపోతలను నిలిపివేసిన చంద్రబాబు ఇంత అన్యాయంగా, బాహాటంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు బడాయి మాటలు చెబుతున్నారని నీటి పారుదల నిపుణులు మండిపడుతున్నారు.


