టూటౌన్ సీఐ శ్రీకాంత్‌పై రెచ్చిపోతున్న టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అనుచరుడు బొజ్జ మైసూరారెడ్డి
అనంతపురం సీఐపై టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అనుచరుడు వీరంగం
జెడ్పీ సమావేశ మందిరం వద్ద రెచ్చిపోయిన బొజ్జ మైసూరారెడ్డి
అనంతపురం: ‘నువ్వు సీఐ అయితే ఏంటి? ఏం పీక్కుంటావ్!’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అనుచరుడు, ఆ పార్టీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి నోరుపారేసుకున్నారు. జెడ్పీ కార్యాలయం ఆవరణలోనే అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్‌పై బూతుపురాణం విప్పారు. ఇంత జరిగినా అతన్ని రాచమర్యాదలతో జెడ్పీ సమావేశంలోకి స్వయాన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి పిలుచుకెళ్లడం విమర్శలకు తావిచ్చింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఒంటికాలిపై లేస్తూ అక్రమ కేసులు బనాయించే సీఐ శ్రీకాంత్ తనపై టీడీపీ నేత బొజ్జ మైసూరారెడ్డి రెచ్చిపోయినా కనీసం మందలించే సాహసం కూడా చేయలేకపోయారు.
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం అనంతపురంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అనుచరులతో కలసి హాజరయ్యారు. సమావేశ మందిరంలోకి ప్రజాప్రతినిధులు, సభ్యులు మినహా ఇతరులు వెళ్లకూడదని సీఐ శ్రీకాంత్ అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ నాయకుడు బొజ్జ మైసూరారెడ్డి రెచ్చిపోయారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపైనే బూతులు తిడుతూ దాడి చేయబోయాడు. ‘సమావేశంలోకి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరు? మేం కూడా నీలాగే డ్యూటీలో ఉన్నాం.
ఏయ్.. నువ్వు సీఐ అయితే ఏంటి? ఏం పీక్కుంటావ్!’ అంటూ రౌడీయిజం ప్రదర్శించాడు. సభ్యులు తప్ప మరెవరినీ లోపలకు అనుమతించరాదని కలెక్టర్ ఆదేశాలిచ్చారని సీఐ శ్రీకాంత్ చెబుతున్నా.. మైసూరారెడ్డి వినకుండా ‘నువ్వెంత మమ్మల్ని ఆపడానికి! మాకు కుర్చీలేదని చెప్పడానికి నువ్వెవడు’ అంటూ చెలరేగిపోయాడు. ఇంతలో పోలీసులు వచ్చి బయటకు గెంటే ప్రయత్నం చేశారు. వెంటనే ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చి బొజ్జ మైసూరా రెడ్డిని లోపలికి తీసుకెళ్లారు. పోలీసులను తన అనుచరుడు తీవ్ర అవమానానికి గురి చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ మాత్రం అతనికే వత్తాసు పలికారు.

బండ బూతులతో రెచ్చిపోయినా..
టీడీపీ నాయకుడు బొజ్జ మైసూరారెడ్డి సీఐ శ్రీకాంత్‌ను బాహాటంగా దుర్భాషలాడినా పోలీసుల్లో ఎలాంటి చలనం కనిపించలేదు. అతనిపై కేసు నమోదు చేయకపోగా.. రాచ మర్యాదలతో సమావేశ మందిరంలోకి పంపించారు. బండ బూతులతో పబ్లిక్‌గా రెచ్చిపోయినా సీఐ శ్రీకాంత్ అతనిపై ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయారు. అధికార పారీ్టకి జీహుజూర్ అంటూ సదరు నేతను అత్యంత గౌరవంగా సమావేశంలోకి పంపించి స్వామిభక్తి ప్రదర్శించారు. టీడీపీ నాయకులపై ఒకలా.. వైఎస్సార్‌సీపీ నాయకులపై మరొకలా వ్యవహరిస్తూ నాలుగో సింహం పూర్తిగా పక్షపాతంగా విధులు నిర్వహిస్తోందనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.


