అనాథలా ముగిసిన మృగాడి కథ | Madanapalle incident | Sakshi
Sakshi News home page

అనాథలా ముగిసిన మృగాడి కథ

Feb 20 2026 6:04 AM | Updated on Feb 20 2026 6:04 AM

Madanapalle incident

చెత్త బండిలో తరలిస్తున్న కులవర్ధన్‌ మృతదేహం, పూడ్చుతున్న దృశ్యం

చెత్త బండిలో తీసుకెళ్లి డంపింగ్‌ యార్డులో పూడ్చేసిన పోలీసులు  

మదనపల్లె టౌన్‌: చస్తే పాడి మోయడానికి నలుగురిని సంపాదించుకోవాలంటారు పెద్దలు. అయితే ఆ నలుగురిని కూడా సంపాదించుకోలేక ఊరి జనం దగ్గర ఛీకొట్టించుకుని, కుటుంబ సభ్యులూ పట్టించుకోకపోవడంతో మృగాడు కులవర్ధన్‌ కథ గురువారం రాత్రి అనాథశవం రూపంలో ముగిసింది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన మదనపల్లె పట్టణం, నీరుగుట్టువారిపల్లెలో మూడు రోజుల క్రితం ఏడేళ్ల బాలికపై హత్యాచారం... అనంతరం బుధవారం కురబలకోట మండలంలోని కనసానివారిపల్లె వద్ద చెరువులో శవమై తేలిన మృగాడి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి ముదివేడు పోలీసులు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు రాకపోవడంతో గురువారం రాత్రి డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో మున్సిపల్‌ సిబ్బందికి అప్పగించారు. వారు చెత్త బండిలో శవాన్ని డంపింగ్‌ యార్డుకు తరలించి ఎస్‌ఐ మధురామచంద్రుని సమక్షంలో పూడ్చేశారు. మరోవైపు బాలిక హత్యాచారం విషయం తెలిసినా కులవర్ధన్‌ తల్లి చెప్పలేదనే ఆరోపణతో ఆ కేసులో ఆమెను ఏ2గా చేర్చారు. ఈ క్రమంలో ఆమెను ఆయా విధుల నుంచి తొలగించినట్లు వెంకటేశ్వరపురం ప్రభుత్వ స్కూలు హెచ్‌ఎం మీడియాకు తెలిపారు. మరోవైపు బాలిక హత్యాచారం నేపథ్యంలో ఆందోళన చేపట్టిన వారిలో 50 మందికి మదనపల్లె డీఎస్పీ మహేంద్ర గురువారం రాత్రి 41 నోటీసులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement