ఆంధ్రా కశ్మీర్‌లో 'విదేశీ' సిరులు | Good income from mixed crop cultivation | Sakshi
Sakshi News home page

ఆంధ్రా కశ్మీర్‌లో 'విదేశీ' సిరులు

Feb 20 2026 5:53 AM | Updated on Feb 20 2026 5:53 AM

Good income from mixed crop cultivation

మిశ్రమ పంటల సాగుతో మంచి ఆదాయం 

శీతల వాతావరణంలో స్ట్రాబెర్రీ, పూలు, కూరగాయల సాగు

గిరిజనుల నుంచి కౌలుకు తీసుకుని వ్యవసాయం 

పర్యాటకుల రాకతో స్థానికంగా పెరిగిన మార్కెటింగ్‌ 

మంచి ఆదాయం పొందుతున్న రైతులు

మంచు దుప్పటి కప్పుకునే లంబసింగి అందాలు పర్యాటకులను మురిపిస్తుంటే, అక్కడి నేలల్లో పండుతున్న విదేశీ పంటలు అన్నదాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మైదాన ప్రాంతం నుంచి వచ్చిన యువ కౌలు రైతులు, ఇక్కడి శీతల వాతావరణాన్ని అవకాశంగా మలుచుకుని వినూత్న రీతిలో వ్యవసాయం చేస్తున్నారు. కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా.. స్ట్రాబెర్రీ, అవకాడో వంటి విదేశీ పండ్లు, రంగురంగుల పూల సాగుతో లంబసింగిని ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దారు. పర్యాటక సీజన్‌లో నేరుగా క్షేత్రం వద్దే విక్రయాలు సాగిస్తూ, మార్కెటింగ్‌ కష్టాలను అధిగమించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్‌గా గుర్తింపుపొందిన అల్లూరి జిల్లా లంబసింగిలో యువ కౌలు రైతులు వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మైదాన ప్రాంతానికి చెందిన వీరు, ఇక్కడి గిరిజన రైతులకు చెందిన పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా విదేశీ రకాల పండ్లు, కూరగాయలు, పూల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు.  

పర్యాటకులను ఆకర్షించేలా.. 
సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండి, అతిశీతల వాతావరణం కలిగిన లంబసింగికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడి వాతావరణం విదేశీ పంటలకు అనుకూలంగా ఉండటంతో, రైతులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండ్ల జాతికి చెందిన స్ట్రాబెర్రీ, అవకాడో, లిచీ, డ్రాగన్‌ ఫ్రూట్, కూరగాయల జాతికి చెందిన  బ్రకోలి, జుకిని, బఠాణి సాగు చేస్తున్నారు. వీటితోపాటు బంతి, చేమంతి, గులాబి, దాలియా, పొద్దుతిరుగుడు వంటి 15 దేశవాళీ రకాలతో పాటు.. జెర్బరా, ఆంథూరియం తదితర 13 రకాల విదేశీ పూల రకాలను సాగు చేస్తున్నారు. 

క్షేత్రం వద్దే మార్కెటింగ్‌ 
ఏడాదికేడాది లంబసింగిని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పర్యాటక సీజన్‌ ప్రారంభం కాగానే రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇ­త­ర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన తాజా పండ్లు, పూలను కొనుగోలు చేయడానికి వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 

తప్పిన ఇబ్బందులు 
పర్యాటకులు నేరుగా పొలాలకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో, రైతులకు మార్కెటింగ్‌ ఇబ్బందులు తప్పాయి.  స్థానికంగానే అమ్మకాలు జరుగుతుండటంతో రవాణా ఖర్చులు తగ్గి మంచి  ధరలు లభిస్తున్నాయని రైతులు 
సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ఏడాది పొడవునా ఆదాయం 
గిరిజన రైతుల వద్ద  కౌలుకు తీసు  ుని సాగు చేస్తున్నాం. విదేశీ రకాల పూలు, పండ్ల వల్ల ఏడాది పొడవునా ఆదాయం లభిస్తోంది. ఖర్చులు పోను మంచి లాభాలు వస్తున్నాయి. పర్యాటక ప్రాంతం కావడంతో అమ్మకాలకు ఎటువంటి ఇబ్బంది లేదు.  – కసిరెడ్డి కృష్ణ, కౌలు రైతు, లంబసింగి 

పర్యాటకుల వల్లే మార్కెటింగ్‌ 
దేశవాళీ పంటలతోపాటు విదేశీ పంటలు సాగు చేపడ్డడం వల్ల మంచి ఆదా యం పొందుతున్నాం. ఈ ఏడాది పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఇక్కడ పండిస్తున్న ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడింది. పర్యాటకులే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. – సత్యనారాయణ, కౌలు రైతు, పిఠాపురం

స్ట్రాబెర్రీ: 200 గ్రాముల బాక్స్‌ రూ.100 నుంచి రూ.120 
స్ట్రాబెర్రీ: 100 నుంచి 200 గ్రాముల బాక్స్‌ రూ.150 నుంచి రూ.200 
బ్రకోలి, జుకిని: కిలో రూ.60 నుంచి రూ.80  
పూలు: రకాన్ని బట్టి కిలో రూ.150 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement