60 హెక్టార్లలో కాలిన అడవి
రెండురోజులు శ్రమించి అదుపులోకి తెచ్చిన సిబ్బంది
అచ్చంపేట: నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో కార్చిచ్చు రాజుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట రేంజ్ వటువర్లపల్లి, ఈగలపెంట బీట్ పరిధిలోని తాటిగుండాల సెక్షన్‌లో తవిసిపెంట, వజ్రాలమడుగు ప్రాంతంలో సుమారు 60 హెక్టార్ల విస్తీర్ణంలో అడవికి నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిప్పుంటుకోగా గురువారం అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
శాటిలైట్ ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఫైర్ వాచర్లు, బేస్ క్యాంపు వాచర్లు, టైగర్ ట్రాకర్లు, బీట్ అధికారులు, శిక్షణాధికారులు బ్లోయర్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. చీకటి పడటంతో బుధవారం రాత్రి మంటలు అదుపులోకి తేలేకపోయారు. హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి పక్క నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర మంటలు విస్తరించాయి. మంటలు చెలరేగిన ప్రాంతంలో ఎత్తయిన కొండలు, లోయలు ఉన్నాయి. దీంతో నడవలేని పరిస్థితి వల్ల మంటలు ఆర్పడం కొంత కష్టంగా మారింది.
గురువారం ఎఫ్‌ఆర్‌వో గురుప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన 20 మంది సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాంతాల్లో గడ్డి, రాళ్లు ఎక్కువగా ఉండడంతో మంటలు చెలరేగాయి. పశువులు, గొర్రెల కాపరులు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 30 హెక్టార్ల విస్తీర్ణంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఇందులో గడ్డి మాత్రమే కాలిందని, చెట్లకు ఎలాంటి నష్టం జరగలేదని అటవీ శాఖ స్పష్టం చేసింది.


